నూతన ఆవిష్కరణలపై దృష్టిసారించాలి
కల్వకుర్తి టౌన్: మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఆవిష్కరణలు రూపొందించేలా విద్యార్థుల ఆలోచనలు ఉండాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి అన్నారు. గురువారం కల్వకుర్తి ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలు, బోధనా పద్ధతులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కళాశాల స్థాయిలోనే సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. అందుకు అనుగుణంగా విద్య అందించేందుకు ప్రతి అధ్యాపకుడు కృషిచేయాలని సూచించారు. విద్యార్థులకు ప్రతి అంశాన్ని ప్రయోగాత్మకంగా వివరించాలన్నారు. ప్రభుత్వం సైతం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులను కల్పిస్తుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాల దిశగా ముందుకు సాగాలన్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వ విద్యను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు. అంతకుముందు ఆయన కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. వసతిగృహంలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను తెలుసుకున్నారు. అనంతరం కళాశాల సిబ్బంది చైర్మన్‌ను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.శ్రీపాద శార్వాణి పాల్గొన్నారు.


