శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం : ఎస్పీ
ఉప్పునుంతల: పోలీసు సిబ్బంది ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ.. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు. గురువారం ఉప్పునుంతల పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. పోలీసు సిబ్బందితో మాట్లాడి మండలంలో శాంతిభద్రతలపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులపై కేసుల నమోదులో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ముందుగా ఎస్పీకి ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. ఎస్పీ వెంట అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాసులు, సీఐ నాగరాజు ఉన్నారు.


