మళ్లీ పోడు రగడ..
ఏళ్లుగా పరిష్కారానికి
నోచుకోని వైనం..
జిల్లాలో అటవీ అధికారులు, రైతులకు మధ్య తరచుగా వివాదం తలెత్తుతోంది. సాగుకోసం రైతులు సమాయత్తమవుతుండగా.. అటవీ అధికారులు అడ్డుకుంటుండటంతో ఘర్షణ వాతావరణం తలెత్తి ఉద్రిక్తతకు దారితీస్తోంది. గతంలోనూ కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండంలో గిరిజన రైతులు పోడు చేసుకుంటున్న భూముల్లో విత్తనాలు వేసేందుకు వెళ్లగా.. అటవీ అధికారులు అడ్డుకున్నారు. అధికారులు, రైతులకు మధ్య ఘర్షణ నేపథ్యంలో ఓ గిరిజన మహిళారైతు అందరి ఎదుటే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొల్లాపూర్ మండలంలోని ముక్కిడిగుండం, మొలచింతలపల్లి, నార్లాపూర్, కుడికిళ్ల, గెమ్యానాయక్ తండా, రామాపురం, సోమశిల, అమరగిరి గ్రామాల్లోనూ పోడు భూములపై వివాదాలున్నాయి. ఏళ్లుగా ఈ భూముల్లో వివాదం కొనసాగుతున్నా పరిష్కారానికి మాత్రం నోచుకోవడం లేదు.
నార్లాపూర్ శివారులో అటవీశాఖ సిబ్బందిపై గిరిజనుల దాడి
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో అటవీ అధికారులు, గిరిజనులకు మధ్య మళ్లీ పోడు వివాదం రాజుకుంది. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ శివారులోని వట్టిమాకుల కుంట అటవీ ప్రాంతంలో మంగళవారం పోడు సాగు చేసేందుకు సిద్ధమైన గిరిజనులను అటవీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన గిరిజనులు ఫారెస్ట్ సెక్షన్ అధికారి జయరాజు, సిబ్బందిపై దాడికి దిగారు. అటవీ అధికారులపై ఏకంగా కర్రలతో దాడికి దిగడంతో అధికారులు, గిరిజన రైతులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ఏళ్లుగా పోడు భూముల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. చాలావరకు పోడు దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటం.. అటవీ, రెవెన్యూ భూములకు హద్దులు నిర్ణయించకపోవడం తరచుగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.
15 ఎకరాల విస్తీర్ణంలో సాగు కోసం..
కొల్లాపూర్ మండలం నార్లాపూర్ శివారులోని వట్టిమాకుల కుంట అటవీ ప్రాంతంలో గ్రామానికి చెందిన కొందరు గిరిజనులు పోడు భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈక్రమంలో చెట్లను తొలగిస్తూ.. సాగుకు సన్నద్ధమవుతున్న క్రమంలో సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అటవీ భూముల్లో చెట్లను తొలగించవద్దని అధికారులు చెప్పగా.. గిరిజన రైతులు వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆగ్రహానికి గురైన రైతులు.. కర్రలతో ఫారెస్ట్ అధికారులపై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు మహిళలతో సహా మొత్తం 11 మందిని గుర్తించిన అధికారులు.. వారిపై కేసు నమోదు చేశారు.
అటవీ ప్రాంతాన్ని
చదును చేస్తుండగా తలెత్తిన ఘర్షణ
గతంలోనూ పలుమార్లు చెలరేగిన వివాదం
అటవీ హద్దులు, ఫెన్సింగ్ లేకపోవడంతో సమస్యలు
మళ్లీ పోడు రగడ..


