‘పీఎం ధన్–ధాన్య కృషి యోజన’కు ప్రణాళికలు
● వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పాదకత పెంచడమే లక్ష్యం
● కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్: జిల్లాలో రానున్న 6 సంవత్సరాల్లో పంటల ఉత్పాదకత పెంచడం, పంటమార్పిడి, సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించే విధంగా ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన పథకం అమలుకు వార్షిక ప్రణాళికలను పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ దేవసహాయంతో కలిసి ఆయన పీఎం ధన్–ధాన్య కృషి యోజన కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, ఉద్యాన శాఖల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పథకాల అమలు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో భూసారం మేరకు రైతులు విభిన్న పంటలు సాగుచేసేలా ప్రోత్సహించడం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పాదకత పెంచడం, అధిక దిగుబడులు సాధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. వ్యవసాయ శాఖతోపాటు మత్స్య, పశుసంవర్ధక, ఉద్యాన, నీటిపారుదల, బ్యాంకింగ్ తదితర 11 శాఖల సమన్వయంతో ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లేలా అధికారులు సమగ్ర కార్యాచరణ రూపొందించి.. అమలుచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, గోదాముల నిర్మాణానికి సైతం అవకాశం ఉందన్నారు. గోదాముల నిర్మాణానికి నాబార్డు 50శాతం సబ్సిడీతో రుణాలు అందిస్తున్నందున.. గ్రామ, మండలస్థాయిలో కూడా ఔత్సాహికులు గోదాములు నిర్మించుకునేలా సంబంధిత అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలోని రైతులకు వ్యవసాయ రుణాలు అందించడంలో బ్యాంకర్లు ముందుండాలన్నారు. వ్యవసాయ రంగంలో జిల్లా ప్రగతి సాధించేందుకు దోహదపడాలని కోరారు. రైతులు ఒకే పంటపై దృష్టిసారించకుండా విభిన్న పంటల సాగు చేపడితేనే ఉత్పాదకత పెరిగి ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉందన్నారు. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో డీఏఓ యశ్వంత్‌రావు, జిల్లా మత్స్యశాఖ అధికారిణి రజిని, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జ్ఞానశేఖర్, జిల్లా డెయిరీ డీడీ సత్యనారాయణరెడ్డి, జిల్లా నీటిపారుదలశాఖ అధికారి మురళి ఉన్నారు.


