పల్లెల్లో ఎన్సీడీ పరీక్షలు
క్షేత్రస్థాయిలో నిరంతరం బాధితుల గుర్తింపు
–8లో u
అచ్చంపేట రూరల్: జీవన శైలి జబ్బులైన బీపీ, షుగర్లు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. ఇంతకు ముందు పట్టణాల్లోనే ఎక్కువగా కనిపించిన ఈ జబ్బులు ఇప్పుడు పల్లెల్లోనూ వ్యాపిస్తున్నాయి. ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉందంటే పరిస్థితి తీవ్రతను అంచనా వేయవచ్చు. గ్రామాల్లో 26 శాతం మంది, పట్టణాల్లో 30 శాతం మంది బీపీ బాధితులు, పల్లెల్లో 19 శాతం మంది, పట్టణాల్లో 24 శాతం షుగర్ బాధితులున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ స్థాయిలో బీపీ, షుగర్ బాధితులుండటం అత్యంత ఆందోళన కలిగించే అంశమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ఈ రెండు ప్రమాదకర జబ్బులను నియంత్రణలో ఉంచుకోలేక గుండెజబ్బులకు గురవుతున్నారు. గతంలో ఎన్సీడీ వ్యాధులను గుర్తించేందుకు అప్పుడప్పుడు మాత్రమే సర్వే చేపట్టేవారు. ఆయా వ్యాధుల బారినపడిన వారికి వైద్యశాఖ ఆధ్వర్యంలో ఔషధాలు అందజేసేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రోగాల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇక నుంచి నిరంతరం ఎన్సీడీ పరీక్షలను గ్రామాల్లో నిర్వహిస్తున్నారు.
ప్రత్యేక కార్యాచరణ..
జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా అసంక్రమిత వ్యాధులను అరికట్టేందుదుకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుంది. 30 ఏళ్లు దాటిన వారికి వైద్య పరీక్షలు జరుపుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహంతోపాటు వివిధ రకాల క్యాన్సర్ రోగాలను నిర్ధారించేందుకు పరీక్షలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలకు వచ్చే వారికి ఎన్సీడీ పరీక్షలు చేయనున్నారు. క్షేత్రస్థాయిలో కూడా ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటికే రక్తపోటు 79,715, మధుమేహం 39,879 మంది ఉన్నట్లు జిల్లా అధికారులు గుర్తించారు.
చేపడుతున్న చర్యలు..
జీవనశైలి జబ్బులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. వారానికోసారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎన్సీడీ (జీవనశైలి జబ్బులు) స్క్రీనింగ్ నిర్వహిస్తోంది. స్క్రీనింగ్ నిర్వహించడంతోపాటు ఉచితంగా మందులు ఇస్తున్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా స్క్రీనింగ్ చేస్తున్నారు.
జీవనశైలిలో మార్పులతో
ఆరోగ్యపర సమస్యలు
గ్రామాల్లో 26 శాతం,
పట్టణాల్లో 30 శాతం మంది రోగులు
అసంక్రమిత వ్యాధులను
అరికట్టేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణ
జిల్లాలో నాలుగు ప్రత్యేక క్లినిక్‌లు,
28 పీహెచ్‌సీల్లో కార్నర్ల ఏర్పాటు


