ఎప్పటికి పూర్తయ్యేనో..?!
త్వరలోనే పూర్తి చేయిస్తాం..
● అచ్చంపేటలో పూర్తికాని అండర్
గ్రౌండ్ డ్రెయినేజీ, కల్వర్టు నిర్మాణాలు
● గడిచిన 10 నెలలుగా
సా..గుతున్న పనులు
● అధికారుల నిర్లక్ష్యం..
ప్రయాణికులకు శాపం
అచ్చంపేట: అచ్చంపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు మూడు అడుగులు ముందుకు.. ఆరడగులు వెనక్కి అన్న చందంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో పట్టణంలో రెండు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, కల్వర్టుల నిర్మాణాలకు ఆర్‌అండ్‌బీ అధికారులు శ్రీకారం చుట్టగా.. ఇప్పటి వరకు అవి పూర్తి కాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. అచ్చంపేట– ఉప్పునుంతల ప్రధాన రహదారి బీఎస్‌ఎన్‌ఎల్ టవర్, పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు ఇన్ గేటు వద్ద రూ.1.20 కోట్ల వ్యయంతో పనులు మొదలు పెట్టారు. అయితే ఆర్‌అండ్‌బీ నుంచి కంట్రాక్టర్ డబ్బులు చెల్లించలేదని పనులు పెండింగ్‌లో పెట్టారు. ఉప్పునుంతల రోడ్డులో కల్వర్టు నిర్మాణం పూర్తయినా అప్రోచ్ రోడ్డు పనులు చేయకపోవడంతో ద్విచక్రవాహనాలు కూడా వెళ్లేలేని పరిస్థితి దాపురించింది. బస్టాండు వద్ద నాలుగు వరుసల రహదారిలో రెండు వైపులకు గాను ఒకవైపు మాత్రమే కల్వర్టు పనులు చేపట్టి వదిలేశారు. దీని అప్రోచ్ రోడ్డు పనులు చేపట్టకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలగుగుతున్నాయి. ద్విచక్రవాహనదారులు ఈ రోడ్డుపై ప్రయాణించి ప్రమాదాలకు గురువుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 20 మందికిపైగా ఈ కల్వర్టు వద్ద కిందపడి గాయాలపాలయ్యారు.
భారీ వర్షాలకు మునక..
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కార్టీసీ బస్టాండు ముందు చెరువును తలపించింది. ప్రధాన రహదారిపై వరద నీరు పారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడగా.. దుకాణాలు నీట మునిగి సామగ్రి దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారు. వరద నీటితోపాటు మురుగు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ పూర్తికాకపోవడమే ఇందుకు కారణం. ఏప్రిల్ మాసంలోనే ఒకవైపు కల్వర్టు పనులు పూర్తయ్యింది. దీనిపైనే రాకపోకలు కొనసాతుండగా.. మరోవైపు ఇంత వరకు పనులు మొదలు పెట్టకపోవడంతో ఎప్పుడు ప్రారంభిస్తారని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే బస్టాండు ప్రాంతంలో రోజుకు వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు వస్తుంటాయి.
అచ్చంపేట పట్టణంలో ఉప్పునుంతల రోడ్డు కల్వర్టు పనులు పూర్తయ్యాయి. బీటీ వేయాల్సి ఉంది. త్వరలోనే పనులు పూర్తి చేయిస్తాం. బస్టాండు ముందు ఒకవైపు కల్వర్టు పనులు పూర్తి కాగా బీటీతోపాటు మరోవైపు కల్వర్టు చేయాల్సి ఉంది. కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెచ్చి పూర్తి చేయించేందుకు కృషిచేస్తాం.
– జలేందర్, ఆర్‌అండ్‌బీ డీఈ, అచ్చంపేట
ఎప్పటికి పూర్తయ్యేనో..?!


