పకడ్బందీగా పత్తి, ధాన్యం కొనుగోళ్లు
యువజనోత్సవాల వాల్‌పోస్టర్ విడుదల
నాగర్‌కర్నూల్: జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేపడుతామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రధాన పంటల కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. వీసీకి జిల్లా నుంచి కలెక్టర్ బదావత్ సంతోష్‌తోపాటు అదనపు కలెక్టర్ అమరేందర్ హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వరి కొనుగోళ్లకు 236 కొనుగోలు కేంద్రాలు, మొక్కజొన్నకు 15 కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 13 వేల మె.ట., మొక్కజొన్న కొనుగోలు చేశామన్నారు. అలాగే పత్తి సేకరణకు ఇప్పటి వరకు 12 కొనుగోలు కేంద్రాల ద్వారా 27,377 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసి రూ.21 కోట్లు 1,295 మంది రైతులకు చెల్లించినట్లు వివరించారు. క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాల వివరాలను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.
ఈవీఎం గోడౌన్‌లో పటిష్ట భద్రత
ఈవీఎం గోడౌన్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. నెల్లికొండ చౌరస్తాలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను సాధారణ పరిశీలనలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన నిర్వహించారు. ఈవీఎం గోడౌన్ వద్ద వేసిన సీల్స్, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి.. బందోబస్తుపై పలు సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రతినెలా ఈవీఎం గోడౌన్‌ను తప్పనిసరిగా తనిఖీ చేస్తున్నామన్నారు.
జిల్లా యువజన సర్వీసు శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18న నిర్వహించే యువజనోత్సవాల వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువజనోత్సవాల్లో పాల్గొనే అభ్యర్థులు జానపద నృత్యం, జానపద పాట, స్టోరీ రైటింగ్, పెయింటింగ్, కవితల పోటీ, సైన్స్ మేళా ఎగ్జిబిషన్ వంటి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. పోటీల్లో పాల్గొనే యువతి, యువకుల వయస్సు పోటీలు నిర్వహించే నాటికి 15–29 ఏళ్లలోపు జిల్లాకు చెందిన వారై ఉండాలన్నారు.


