గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలి
అందుబాటులో గడ్డి విత్తనాలు
లింగాల: జిల్లాలో పశువులు, గేదులు, ఇతర మూగజీవాలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేసే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుందని జిల్లా పశువైద్యాధికారి జ్ఞానేశ్వర్ అన్నారు. మండలంలోని దత్తారంలో సోమవారం నిర్వహించిన గాలికుంట వ్యాధి నివారణ టీకాల పంపిణీ శిబిరాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో ఈ నెల 14 వరకు వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని, ఆయా గ్రామాల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శిబిరాలకు మూగజీవాలను తీసుకువచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. జిల్లాకు 2.52 లక్షల డోసుల వ్యాక్సిన్ రాగా ఇప్పటి వరకు 1.80 లక్షల డోసులను పంపిణీ చేశామని, మరో 30 శాతం వ్యాక్సిన్ వేయాల్సి ఉందన్నారు. ప్రతిఏటా రెండు పర్యాయాలు గాలికుంట వ్యాధి నివారణ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని చెప్పారు. వచ్చే నెలలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేస్తామని, ఈ అవకాశాన్ని కాపరులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి ప్రియాంక, సిబ్బంది సమ్రీన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలోని పశువుల ఆస్పత్రుల్లో అందుబాటులో గడ్డి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని జ్ఞానేశ్వర్ చెప్పారు. ఒక్కో రైతుకు 70 శాతం సబ్సిడీపై 5 నుంచి 20 కిలోల వరకు విత్తనాలను అందజేస్తామన్నారు. విత్తనాలు కావాల్సిన రైతులు ఆధార్, భూమి పట్టాదార్ పాసు పుస్తకం జిరాక్స్ తీసుకువచ్చి విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు.


