పక్కాగా భూముల లెక్క
నాగర్‌కర్నూల్: భూ భారతి చట్టాన్ని అమలులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా భూముల లెక్క తేల్చేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే జిల్లాలోని ఏ మండలంలో.. ఏ గ్రామంలో.. రీ సర్వే నిర్వహిస్తున్నారనే విషయంలో గజిట్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. 15 రోజుల తర్వాత రెండోసారి నోటిఫికేషన్ జారీ చేసి సర్వే పనులను మొదలు పెట్టనున్నారు. అయితే జిల్లాలో రీ సర్వేకు సంబంధించి 4 గ్రామాలను గుర్తించారు. అదేవిధంగా రైతుల భూ సర్వే చేసేందుకు 70 గ్రామాలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన గ్రామాల్లో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకుని సర్వే చేసి మ్యాప్‌లతో సహా కొత్త రికార్డులను రూపొందించనున్నారు.
ఏయే గ్రామాల్లో అంటే..
జిల్లా పరిధిలో రీ సర్వే కోసం 4 గ్రామాలను ఎంపిక చేశారు. బిజినేపల్లి మండలంలోని ఖానాపూర్, తిమ్మాజిపేట మండలంలోని మరికల్, లింగాల మండలంలోని అంబట్‌పల్లి, కొల్లాపూర్ మండలంలోని మొలచింతపల్లి గ్రామంలో సర్వే చేపట్టనున్నారు. దీనికి సంబంధించి గ్రామ పరిధిలో ప్రభుత్వ భూములు, పట్టా భూములు, ఇతరత్రా భూములను సర్వే చేసి సమగ్ర నివేదికను తయారు చేయనున్నారు. ఇక దీంతోపాటు జిల్లా పరిధిలోని 70 గ్రామాల్లో ఎంజాయ్ సర్వే చేయనున్నారు. ఈ సర్వే రైతులకు సంబంధించి భూమి ఎవరి ఆధీనంలో ఉంది.. సర్వే నంబర్.. డివిజన్ నంబర్ సరైనదేనా.. కాదా.. వాటి హద్దులు అన్ని కూడా సర్వే చేసి అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తారు. తద్వారా భూమి హక్కుల నిర్ధారణ పూర్తిచేసి రైతుల వివవరాల ఆధారంగా భూధార్ కార్డును అందజేస్తారు. ప్రతి కమతానికి యూనిక్ ఐడీ నంబర్ ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని భూధార్ కార్డులను ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సర్వే రికార్డులో ఉన్న వివరాలు, ఆర్‌ఓఆర్‌లో ఉన్న వివరాలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తొలుత తాత్కాలిక భూ ధార్ కార్డులు ఇచ్చి రీ సర్వే పూర్తి చేసిన తర్వాత శాశ్వత కార్డులు ఇవ్వనున్నారు.
అత్యంత కచ్చితత్వంతో..
ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఆధునిక టెక్నాలజీని వినియోగించనున్నారు. డీజీపీఎస్ (డిఫరెన్షియల్ గ్లోబల్ పొజీషన్ సిస్టం) ద్వారా ఈ సర్వే చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ రికార్డుల ప్రకారం హద్దులను నిర్ణయిస్తారు. ఒక్కో సర్వే నంబర్‌లో డిజిటల్ సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాత సర్వే నంబర్లలో రైతుల వారిగా విస్తీర్ణం ప్రకారం హద్దులు నిర్ణయిస్తారు. అక్షాంశాలు, రేఖాంశాల వారిగా జియో ఇన్ఫర్మేషన్ సిస్టంకు అనుసంధానం చేస్తారు. డీజీపీఎస్ ద్వారా నిర్వహించే ఈ సర్వేలో కచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది. భూ సర్వే నిర్వహించే సమయంలో, హద్దులను నిర్ధారించే సమయంలో రైతులకు నోటీసులు జారీ చేయనున్నారు. భూములకు సంబంధించిన పట్టాదారులు, రిజిస్ట్రేషన్‌దారులు సర్వే సమయంలో హాజరు కావాల్సి ఉంటుంది. సర్వే పూర్తయిన తర్వాత ఆయా గ్రామాల్లో రైతుల నుంచి ఆక్షేపణలను స్వీకరిస్తారు. రైతులకు ఎ లాంటి అభ్యంతరం లేకపోతేనే మ్యాపులతో సహా కొత్త రికార్డులు రూపొందించనున్నారు.
జిల్లాలోని నాలుగు గ్రామాల్లో రీ సర్వేకు సన్నాహాలు
భూధార్ కోసం మరో 70 పల్లెల్లో ఎంజాయిమెంట్ సర్వే
మరో 15 రోజుల తర్వాత రెండోసారి నోటిఫికేషన్
మ్యాపులతో సహా రికార్డుల రూపకల్పనకు చర్యలు
త్వరలోనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
అన్నింటినీ సరిచేసేందుకే..
భూముల సర్వే జరిగి చాలా సంవత్సరాలు కావొస్తుండడంతో క్షేత్రస్థాయిలో భూమికి, రికార్డుల్లో భూమికి చాలా వ్యత్యాసం ఉంటుంది. వీటన్నింటిని సరి చేసేందుకే ప్రభుత్వం రీ సర్వే చేపట్టింది. మరో 15 రోజుల్లో రెండోసారి నోటిఫికేషన్ పూర్తి చేసి సర్వే ప్రారంభిస్తాం. ఆధునిక పరికరాలతో ఈ సర్వే చేపడుతున్నందున భూముల లెక్కలు పక్కాగా ఉంటాయి. నాగేందర్, జిల్లా సర్వే, ల్యాండ్ ఏడీ
పక్కాగా భూముల లెక్క


