‘సర్’కు సన్నద్ధం
● ఓటర్ల జాబితా సమగ్ర
సవరణ కోసం ఏర్పాట్లు
● నాలుగు కేటగిరీలుగా విభజించి తయారీ
● 2002 ఓటరు లిస్టు
ప్రామాణికంగా కసరత్తు
● బోగస్ ఓట్లకు
చెక్‌పడే అవకాశం
అచ్చంపేట: నకిలీ ఓట్ల తొలగింపు, తప్పుల సవరణే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) చేపట్టగా.. దీనికోసం జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. త్వరలో అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు జాబితాను పరిశీలించనున్నారు. దీంతో బోగస్ ఓట్లకు చెక్‌పడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం రెండు దశాబ్దాలకు ఒకసారి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే నిర్వహిస్తుంది. గతంలో 2002లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరగగా.. 23 ఏళ్ల తర్వాత మళ్లీ నిర్వహించబోతున్నారు. అప్పటి జాబితాలను పరిగణలోకి తీసుకుని సవరణ చేయనున్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి పలు దఫాలుగా కలెక్టర్, ఎన్నికల అధికారులతో వీసీ నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
ఓట్లు గల్లంతు..
ఏటా ఓటర్ల జాబితా సవరించే కార్యక్రమం నడుస్తోంది. అయితే చాలాచోట్ల బోగస్ ఓట్లు ఉన్నాయని, అలాగే ఓట్లు గల్లంతయ్యాయనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి వెళ్లిన ప్రజలు తమ ఓట్లు గల్లంతయ్యాయంటూ ఆందోళనలనకు దిగుతుండడం సర్వసాధారమైపోయింది. మరికొందరికి పట్టణాల్లో రెండు, మూడు వార్డుల్లో ఓట్లు ఉండటం, అలాగే పట్టణాల్లో ఓట్లు ఉన్నవారికి పల్లెల్లోనూ ఓట్లు ఉండటం వంటివి చూస్తుంటాం. మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినప్పుడు పట్టణాల్లో ఓటు వేయడం, పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు పల్లెల్లో ఓటు వేయడం ద్వారా పలువురు ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారి ఓట్లు కొందరు రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం పట్టణాల్లో నమోదు చేయిస్తుంటారు. పట్టణాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు వారంతా వచ్చి ఓట్లు వేయడం ద్వారా గెలుపోటములను శాసిస్తుంటారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ద్వారా బోగస్ ఓటర్లు బయటపడే అవకాశాలు ఉంటాయి. వాటిని తొలగించడం ద్వారా బోగస్ ఓట్లకు చెక్‌పడే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.
ఏ, బీ, సీ, డీ కేటగిరీలు..
ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కోసం 2002 ఓటర్ల జాబితాతోపాటు 2025 ఓటర్ల జాబితాల్లో నమోదైన వారి వివరాలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించి సవరణ చేస్తారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సవరణ ప్రక్రియ మొదలైంది. బూత్ లెవల్ అధికారులు(బీఎల్‌ఓ)లు ఈ పనిలో నిమగ్నమయ్యారు. 39 ఏళ్ల పైబడి ఉండి, 2002 ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదైన వారు ఏ కేటగిరిలో, 39 ఏళ్ల పైబడి 2002 ఓటర్ల జాబితాలో పేరు లేని వారి వివరాలను బీ కేటగిరిలో ఉంటారు. 21– 38 ఏళ్లలోపు వారు 1987 నుంచి 2004 మధ్యకాలంలో జన్మించిన వారిని సీ కేటగిరిలో, 18–20 ఏళ్లలోపు అంటే 2004 తర్వాత జన్మించిన వారి జాబితాను డీ కేటగిరీలో చేరుస్తారు.


