రాజీ మార్గంతో సత్వర న్యాయం
నాగర్‌కర్నూల్ క్రైం: రాజీ మార్గంతో సత్వర న్యాయం లభిస్తుందని.. ఈ నెల 15న జిల్లాలోని న్యాయస్థానాల్లో నిర్వహించే ప్రత్యేక లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా సూచించారు. గురువారం జిల్లా కోర్టులో ప్రత్యేక లోక్‌అదాలత్ నిర్వహణపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు, చెక్‌బౌన్స్, కుటుంబ తగాదాలు, రోడ్డు ప్రమాదాలు, భూ వివాదాలు, బ్యాంకు కేసులు తదితర వాటిని లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఈ నెల 15న నిర్వహించే ప్రత్యేక లోక్‌అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ అయ్యే విధంగా కృషి చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. రాజీ మార్గం ద్వారా ఽశాంతియుత వాతావరణంలో కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవాలని.. తద్వారా అప్పీలు లేని తీర్పును పొంది సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చని తెలిపారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి శ్రుతిదూత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి ఎన్.శ్రీనిధి, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ అశోక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


