‘ప్రతి గింజనూ కొంటాం’
అచ్చంపేట రూరల్: రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గురువారం అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తోందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తామన్నారు. అనంతరం లింగాల రోడ్డులో సీసీ పనులను ప్రారంభించారు.
● నల్లమలలోని పేదల ఆరోగ్యం కాపాడటానికే ప్రత్యేక హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. సీబీఎం ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో మల్టీ స్పెషాలిటీ మెగా హెల్త్ క్యాంప్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అచ్చంపేట ఏరియా ఆస్పత్రిలో తాను స్వయంగా నిర్వహించిన సర్జికల్ క్యాంపులో 1,467 మందికి ఆపరేషన్లు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న క్యాంపులో ఇప్పటికే 1,500 మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నారని.. వారందికీ ప్రత్యేక వైద్య నిపుణులు పరీక్షిస్తారన్నారు. క్యాంపులో పాల్గొనే ప్రతి ఒక్కరికీ భోజన వసతి కల్పించామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ అంతటి రజిత మల్లేశ్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, పీఏసీఎస్ చైర్మన్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


