అక్రమ నిర్మాణాలపై చర్యలేవి?
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాను భారీ వర్షం మరోసారి ముంచేసింది. మంగళవారం జిల్లాకేంద్రంలో మధ్యాహ్నం కుండపోత వాన కురిసింది. తెలకపల్లి మండలంలో అత్యధికంగా 69.3 మి.మీ., వర్షపాతం నమోదు కాగా, నాగర్‌కర్నూల్‌లో 57.3 మి.మీ వర్షం కురిసింది. కేవలం రెండు గంటల వ్యవధిలో 50 మి.మీ., మించి వర్షం దంచికొట్టడంతో జిల్లాకేంద్రం జలమయమైంది. జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారితోపాటు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరద నీరంతా ప్రధాన రహదారిపైకి చేరడంతో వాహనాలు నీటిలో మునిగిపోయాయి. సుమారు రెండున్నర గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారిపై బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం నుంచి ఉయ్యాలవాడ వరకు ఇరువైపులా బస్సులు, వాహనాలు నిలిచిపోయాయి.
వరద ప్రవాహంలో..
జిల్లాకేంద్రంలో కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. ప్రధాన రహదారి పొడవునా నీటితో నిండిపోగా సాయంత్రం వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం, ఓంనగర్ కాలనీ, ఈశ్వర్‌కాలనీ, హౌసింగ్‌బోర్డు, బస్టాండ్, అంబేడ్కర్ చౌరస్తా, నల్లవెల్లి రోడ్ ప్రాంతాలు వరద ప్రవాహంలో చిక్కుకున్నాయి. ప్రధాన రహదారిపై నాలాలు ఉప్పొంగి ప్రవహించడంతో బైక్‌లు, ఆటోలు, కార్లు నీటిలో మునిగిపోయాయి. సుమారు 2 కి.మీ., దూరం వరకు ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం వరకు నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. జిల్లాకేంద్రంలోని రాంనగర్‌కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద వరదలో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వాహనదారులు
నాలాలపైనే నిర్మాణాలు..
జిల్లాకేంద్రం నలుమూలల నుంచి వరద ప్రవాహం వెళ్లేందుకు ఉన్న నాలాలు నీటిని కేసరి సముద్రం చెరువు వైపు తీసుకెళ్తాయి. కీలకమైన ఈ నాలాలు అక్రమ నిర్మాణాలతో ఇప్పటికే కుంచించుకుపోయాయి. ఓంనగర్‌కాలనీ, 9 జంక్షన్, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం, ఈశ్వర్‌కాలనీ సమీపంలో ఉన్న నాలాలపై ఎక్కడబడితే అక్కడ భవన నిర్మాణాలతోపాటు షాపులు వెలిశాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహానికి ఈ నిర్మాణాలు అడ్డుగా ఉండటంతో నాలాల నుంచి నీటి ప్రవాహం ఉప్పొంగి రోడ్డుపైకి చేరుతోంది. చినుకు పడితే చాలు ఈ ప్రాంతమంతా నీరు చేరి ప్రధాన రహదారి తరచుగా జలమయంగా మారుతోంది. మంగళవారం నాటి కుండపోత వర్షానికి వరద ప్రవాహం పెరిగి, నాలాల ద్వారా బయటకు వెళ్లే మార్గం లేక ప్రధాన రహదారి చెరువును తలపించగా.. వాహనాలు అందులో మునిగిపోయాయి.
జిల్లాకేంద్రంలో ఎక్కడబడితే అక్కడ అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ప్రధాన రహదారి, నాలాలు, డ్రెయినేజీ, వాననీటి మార్గాలు తేడా లేకుండా మట్టితో నింపి నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో వర్షం పడినప్పుడు నీరు బయటకు వెళ్లే దారి లేక రోడ్డుపైనే చేరుతోంది. జిల్లాకేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించినా అందులోని నీటిని బయటకు తరలించేందుకు పంపింగ్ స్టేషన్ నిర్మాణం, అక్కడి వరకు పైప్‌లైన్ ఏర్పాటు చేయలేదు. దీంతో డ్రెయినేజీల్లో నీరు నిండగానే మురుగు రోడ్లపైనే చేరుతోంది. నాలాలపై ఉన్న నిర్మాణాలను తొలగించి వరద నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని పట్టణవాసులు కోరుతున్నారు.


