ఉపాధ్యాయుల్లో ‘టెట్‌’ టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల్లో ‘టెట్‌’ టెన్షన్‌

Nov 5 2025 8:44 AM | Updated on Nov 5 2025 8:44 AM

ఉపాధ్

ఉపాధ్యాయుల్లో ‘టెట్‌’ టెన్షన్‌

అచ్చంపేట: ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాలకు టీచర్స్‌ ఎలిజెబిలిటీ టెస్ట్‌ (టెట్‌) అర్హత తప్పనిసరి. ఈ తీర్పు ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తుందా అనే సందేహాలు జిల్లావ్యాప్తంగా ఆందోళనలకు కారణమవుతున్నాయి. అంగవైకల్యంతోపాటు ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు బోధించే టీచర్లూ టెట్‌ రాయాల్సిందేనని హైకోర్టు అక్టోబరు 31న తేల్చి చెప్పింది. గతేడాది ఫిబ్రవరి 28న రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన జీఓ 4ను సవాల్‌ చేస్తూ స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ విభాగంలో స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలవగా.. న్యాయమూర్తులు పైవిధంగా తీర్పు వెల్లడించారు. గతంలో టెట్‌ అర్హత లేకుండా నియమితులైన ఉపాధ్యాయులకు తప్పనిసరి చేస్తూ తాజాగా సుప్రీంకోర్టు సైతం తీర్పు ఇచ్చింది.

కనీసం ఐదేళ్ల సర్వీసు

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొనసాగడానికి, పదోన్నతులకు టెట్‌ అర్హత తప్పనిసరి అని స్పష్టం చేసింది. కనీసం ఐదేళ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్‌ ఉత్తీర్ణత సాధించాలని, లేనిపక్షంలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది. అయితే పదవీ విరమణకు ఐదేళ్లలోపు సమయం ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చినప్పటికీ వారు పదోన్నతుల అర్హత కోసం టెట్‌ పాస్‌ కావాల్సి ఉంటుంది. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) ఆర్‌టీఈ–2010 నిబంధనల ప్రకారం టెట్‌ తప్పనిసరి చేయగా.. ఉమ్మడి రాష్ట్రంలో 2012 డీఎస్పీ పరీక్షల్లోనూ ఈ నిబంధన అమలైంది.

ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లు..

ప్రస్తుత ఉపాధ్యాయుల సేవలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాలు రూపొందించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. టెట్‌ అర్హతపై సడలింపు లేదా ప్రత్యామ్నాయ పరిష్కారాలు అవసరమని డిమాండ్‌ చేస్తున్నారు.

సర్వీస్‌ టీచర్ల ఆందోళన

ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన వారితోనే టెట్‌ రాసేందుకు సర్వీస్‌లో ఉన్న టీచర్లు ససేమిరా అంటున్నారు. సర్వీసు టీచర్లకు ప్రత్యేకంగా టెట్‌ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో టెట్‌ సమగ్ర నోటిఫికేషన్‌ విడుదలకు జాప్యం జరుగుతోంది. సర్వీస్‌ టీచర్లు టెట్‌ రాసేందుకు అవసరమైన మార్గదర్శకాలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రక్రియ పై విద్యాశాఖ ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రత్యేక టెట్‌ పెట్టకపోతే ఎప్పుడో బీఎడ్‌, టీటీసీ చేసిన వారు ఇప్పుడు టెట్‌ రాస్తే పాసయ్యే అవకాశం తక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

స్పెషల్‌ టీచర్లకు తప్పనిసరి అనితేల్చి చెప్పిన హైకోర్టు

అర్హత ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు

పదోన్నతులకు అదే వర్తింపు

సీనియర్లలో ఒత్తిడి.. స్వాగతిస్తున్న యువతరం

ఉపాధ్యాయుల్లో ‘టెట్‌’ టెన్షన్‌ 1
1/1

ఉపాధ్యాయుల్లో ‘టెట్‌’ టెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement