11 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ
పాలమూరు/ కల్వకుర్తి రూరల్: ఉమ్మడి జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ల బృందం మంగళవారం కల్వకుర్తి డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో మెడికల్ దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డిప్యూటీ డైరెక్టర్ అంజుమన్ అబీద ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా ఔషధ నియంత్రణ శాఖ ఏడీ దినేష్‌కుమార్ ఆధ్వర్యంలో కల్వకుర్తి, ఊర్కొండ, చారకొండ, వంగూరు, వెల్దండ మండల కేంద్రాల్లోని 11 మెడికల్ దుకాణాల్లో తనిఖీలు చేసి నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. లైసెన్స్ నిబంధనలు, ఔషధాల నిల్వ, విక్రయాల విషయంలో నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీ హెచ్చరించారు. తనిఖీల్లో నాగర్‌కర్నూల్ డ్రగ్‌ఇన్‌స్పెక్టర్ విశ్వంత్‌రెడ్డి, ఇతర జిల్లాల డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు రఫీ, అన్వేష్, శ్వేత బిందు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
అన్నవరం యాత్రకు
ఆర్టీసీ బస్సు
కొల్లాపూర్: అన్నవరం, పంచారామాల యాత్రకు శుక్రవారం కొల్లాపూర్ నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఉమాశంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం రాత్రి 6 గంటలకు బస్సు కొల్లాపూర్ బస్టాండ్ నుంచి బయలుదేరి శనివారం అన్నవరం చేరుకుంటుందన్నారు. సత్యనారాయణస్వామి దర్శనం అనంతరం సామర్లకోట ద్రాక్షారామం దర్శనం చేసుకొని రాత్రికి పాలకొల్లులో బస ఏర్పాటు చేస్తామన్నారు. ఆదివారం పాలకొల్లు, భీమవరం, అమరావతి, మంగళగిరి దర్శనం అనంతరం విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం ఉంటుందన్నారు. సోమవారం కొల్లాపూర్‌కు బస్సు తిరిగి చేరుకుంటుందని తెలిపారు. ఈ యాత్రకు ఒక్కొక్కరికీ టికెట్ ధర రూ.3,200గా నిర్ణయించామన్నారు. యాత్రకు వచ్చేవారు సెల్ నం.90100 39788, 94407 21154, 83090 29951లను సంప్రదించాలని సూచించారు.
జీవాలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా
నాగర్‌కర్నూల్: జీవాల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం చేపట్టిన టీకా కార్యక్రమాన్ని పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని పశు వ్యాధుల నిర్ధారణ కేంద్ర అధికారి డాక్టర్ కరుణశ్రీ అన్నారు. మంగళవారం తెలకపల్లి మండలంలోని చిన్నముద్దునూర్ గ్రామంలో కొనసాగుతున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పశువుల రక్త నామూనాలు సేకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గాలికుంటు వైరస్ ద్వారా సోకే ప్రమాదకరమైన వ్యాధి అని, దీనిని నిర్మూలించడానికి విధిగా టీకా ఇప్పించాలన్నారు. జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాధి వల్ల జీవాలు మృతిచెంది పోషకులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, ఈ వ్యాధికి నివారణకు టీకాలే మేలైన మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి వెంకటేశ్వర్లు, డాక్టర్ మధు, సిబ్బంది అస్లాం, అరుణ్‌కుమార్, సల్మా తదితరులు పాల్గొన్నారు.
పులుల సంరక్షణ
అందరి బాధ్యత
మన్ననూర్: తెలంగాణలో ఏఐటీఈ–2026 పెద్ద పులుల అంచనా కోసం 18 నుంచి 60 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారు మంగళవారం నుంచి ఈ నెల 22 వరకు చేపట్టే పులుల గుర్తింపులో భాగస్వాములు అయ్యేందుకు పేర్లు నమోదు చేసుకోవాలని అమ్రాబాద్ ఎఫ్‌డీఓ రామ్మూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్ద పులులు, అభయారణ్యాల సంరక్షణ మన అందరి బాధ్యతగా భావించాలన్నారు. పులుల సంరక్షణ ప్రాంత మాతృ ప్రకృతితోపాటు వన్యప్రాణులను ట్రాక్ చేయడంలో అటవీ శాఖకు సహాయం చేసేందుకు కృషి చేయాలన్నారు. పులుల గణన కోసం జట్టులో చేరండి.. కొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు ముందుకురావాలని కోరారు.
11 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ


