మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడి
కొల్లాపూర్: పట్టణంలోని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయాన్ని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ముట్టడించారు. మంగళవారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి విద్యార్థులు ర్యాలీగా మంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల ప్రధాన కార్యదర్శులు ఆది, తారాసింగ్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివవర్మ మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో జాప్యం కారణంగా పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన మాట ప్రకారం పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. అనంతరం వినతిపత్రాన్ని క్యాంపు కార్యాలయ సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో నాయకులు వీరన్ననాయక్, కార్తీక్, శివప్రసాద్ పాల్గొన్నారు.


