
మున్సిపాలిటీల్లో వేధిస్తున్న వాహనాల కొరత
అచ్చంపేట: మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తడి, పొడి చెత్త సేకరణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చెత్త సేకరణ వాహనాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం లేదు. వాహనాలు తరుచుగా మరమ్మతుకు గురవడంతో చెత్తం సేకరణలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. జిల్లాలోని ఏ మున్సిపాలిటీలో చూసినా వార్డుకో వాహనం ఉండటం లేదు. దీంతో ఇళ్లలో రోజువారీగా చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఈ క్రమంలో దోమలు, ఈగలు వ్యాప్తి చెంది అనారోగ్యం బారిన పడుతున్నామని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ప్రతిరోజు 35 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నా.. అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరుపయోగంగా మారుతోంది. అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో డపింగ్ యార్డు కోసం మండలంలోని చౌటపల్లి శివారులో 6 ఎకరాల భూమిని కొనుగోలు చేసి డంపింగ్ యార్డు నిర్మించారు. రెండేళ్ల క్రితం డంపింగ్ యార్డు షెడ్డుల నిర్మాణం, బయో మైనింగ్ యంత్రాలు ఏర్పాటు చేసిన ఇంత వరకు ప్రారంభించలేదు. నిత్యం 8 టన్నుల తడి, పొడి చెత్తను వేరు చేయకుండా డంపింగ్ యార్డు ఖాళీ స్థలంలో పడేసి ఎప్పటికప్పుడు నిప్పు అంటిస్తున్నారు. చెత్తతో ఆదాయ వనరులు పెంచడంపై దృష్టిసారించి ప్లాస్టిక్, కాటన్ డబ్బాలు, తడి చెత్తతో కంపోస్టు ఎరువుల తయారీపై శ్రద్ధ చూపాల్సి ఉంది. ఇళ్ల నుంచి సేకరించి చెత్తను రోడ్లపై, డంపింగ్ యార్డుల సమీపంలో ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు.
మొక్కబడిగా పనులు..
శానిటేషన్ విభాగంలో ఒక రెగ్యులర్ ఇన్‌స్పెక్టర్, ముగ్గురు జవాన్లు, 12 మంది డ్రైవర్లు, 66 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. 20 వార్డులకు 7 మంది వార్డు ఆఫీసర్లు ఉండగా ఒక్కొక్కరికి రెండు, మూడు వార్డులను కేటాయించారు. వార్డు ఆఫీసర్లు అసలు శానిటేషన్‌పై దృష్టిపెట్టడం లేదు. జవానులున్నా.. కార్మికులకు పనులు అప్పగించి వెళ్లిపోతారని, మొక్కుబడిగా పనులు చేస్తారన్న విమర్శలున్నాయి. కార్మికులు చాలామంది రోజు డుమ్మాలు కొడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నా.. కార్మికులు సైతం సరిగా పనులు చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
నిరుపయోగంగా బయో మైనింగ్ యంత్రం
అచ్చంపేట మున్సిపాలిటీలో సేకరించిన చెత్తను వేరు చేసేందుకు తెచ్చిన బయో మైనింగ్ యంత్రం నిరుపయోగంగా మారింది. ప్రతి మున్సిపాలిటీకి కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి బయో మైనింగ్ యంత్రాలను పంపించారు. ఇక్కడికి చేరిన యంత్రం డంపింగ్ యార్డులో నిరుపయోగంగా ఉంది. యంత్రానికి సంబంధించి పూర్తి సామగ్రి రాకపోవడంతో 2023 నుంచి ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ తుప్పు పడుతోంది.