
ప్రజా కోర్టులో బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు శిక్ష తప్పదు
● బీసీ రిజర్వేషన్ విషయంలో
ప్రజల చెవిలో పువ్వు పెడుతున్నారు..
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్‌కర్నూల్: బీసీ రిజర్వేషన్ల విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో చేపట్టిన ధర్నాలో మంత్రి పాల్గొన్నారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి.. అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ధర్నానుద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రాంత బీజేపీ నాయకులు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి బీసీ బిల్లుకు చట్టబద్దత కల్పించేలా కృషి చేయకుండా.. ఇక్కడ ధర్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 120 సార్లు మార్చిన రాజ్యాంగాన్ని న్యాయపరమైన బీసీ రిజర్వేషన్ల కోసం ఎందుకు మార్చకూడదని ప్రశ్నించారు. బీజేపీ అనుకుంటే బీసీ రిజర్వేషన్ల అంశం గంటలో తేలిపోతుందని అన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌కు బీసీలపై చిత్తశుద్ధి లేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కులగణన చేసి ఉంటే ఈ పాటికి చట్టబద్ధత వచ్చేదని అన్నారు. బీజేపీకి బీఆర్‌ఎస్ అడుగడుగునా మద్దతు ఇచ్చిందని.. నోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం మద్దతిచ్చిన బీఆర్‌ఎస్ బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉంటే ఎప్పుడో చట్టబద్ధత వచ్చేదన్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నాయని విమర్శించారు. ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకోసమే 80వేల మంది సిబ్బందితో నర్వే నిర్వహించి.. శాసనసభలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపించడం జరిగిందన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బీసీ రిజర్వేషన్లు సాధిస్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ నాయకులు చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, మాజీ ఎంపీపీ ప్రతాప్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.