
బీసీ బంద్ సంపూర్ణం
డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
● స్వచ్ఛందంగా వ్యాపార దుకాణాల మూసివేత
● నిర్మానుష్యంగా మారిన రహదారులు
● రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల
ఆధ్వర్యంలో ధర్నాలు
నాగర్‌కర్నూల్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ బంద్ జిల్లాలో సంపూర్ణంగా ముగిసింది. వ్యాపారులు ఉదయం నుంచే వ్యాపార దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయగా.. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారుజామునే రాజకీయ పార్టీల నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్దకు చేరుకొని బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. డిపో గేట్ వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయా పార్టీలు, సంఘాల నాయకులు వేర్వేరుగా ర్యాలీలు చేపట్టారు. తెరిచిన పలు వ్యాపార దుకాణాలను మూసివేశారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని మాట్లాడారు. అదే విధంగా బీఆర్‌ఎస్, బీఎస్పీ, సీసీఎం, సీపీఐ, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. బంద్‌తో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంతో పాటు ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ప్రయాణికులు కొంత ఇబ్బందికి గురయ్యారు.
● అచ్చంపేటలో బీసీ జేఏసీ నాయకుడు సాదె రాజు ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4 గంటలకే ఆర్టీసీ డిపో వద్దకు చేరుకొని బస్సులు బయటకు రానివ్వలేదు. మెడికల్ షాపులు, అంబులెన్సులు వంటి అత్యవసర సేవలు మినహా ఇతర ఏ సేవలు కూడా అందుబాటులోకి రాలేదు. అన్ని పార్టీలు, కుల సంఘాల నాయకులు బంద్‌కు మద్దతు పలికారు. అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన రాస్తారోకోలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని మాట్లాడారు.
● కొల్లాపూర్‌లోని కమాన్ వద్ద కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, దళిత సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, బీసీ సంఘాలు, బీజేపీ నాయకుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.
● కల్వకుర్తి ఆర్డీసీ డిపో వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పాల్గొన్నారు.

బీసీ బంద్ సంపూర్ణం

బీసీ బంద్ సంపూర్ణం