
సమయపాలన పాటించకుంటే చర్యలు
సమస్యల పరిష్కారానికే
ప్రజావాణి..
● గురుకులాల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి
● స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలి
● కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్: అధికారులంతా సమన్వయంతో పనిచేసి వందశాతం లక్ష్యాలను చేరుకోవాలని.. వేగవంతంగా అభివృద్ధి కార్యక్రమాల అమలు, పారదర్శకతపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి వివిధ శాఖల అధికారులతో జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల్లో పురోగతి, పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్రంగా చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సమీకృత కలెక్టరేట్‌లోని అన్నిశాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని విధిగా పాటించాలన్నారు. ఈ నెల నుంచి బయోమెట్రిక్ హాజరు ద్వారానే వేతనాలు విడుదలచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమయపాలన పాటించని అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ప్రతి శాఖ ప్రగతి నివేదికలను తనకు పంపించాలన్నారు. అధికారులు సమర్థవంతంగా పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వివిధ శాఖల నుంచి కలెక్టర్ అనుమతుల కోసం వచ్చే ప్రతి ఫైల్ ఈ ఆఫీస్ ద్వారానే పంపించాలని ఆదేశించారు. జిల్లా అధికారులకు కేటాయించిన గురుకులాలను తప్పనిసరిగా సందర్శించాలని.. విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలన్నారు. గురుకులాల్లో బోధనా పద్ధతులు, వసతి, ఆహారం, ఆరోగ్య అంశాలపై సమీక్ష జరిపి.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మండలాల ప్రత్యేకాధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఓటర్ల జాబితా పక్కాగా రూపొందించడంతో పాటు, పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
● సీజన్ వ్యాధులపై వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. భారీ వర్షాలు, వరద సహాయం తదితర అంశాలపై కలెక్టర్‌కు పలు సూచనలు చేశారు. వీసీ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా కలిగిన నష్టాలపై ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సూచనలను జిల్లాస్థాయిలో అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజన ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించి.. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదకర స్థాయిలో ఉన్న చెరువులు, కుంటలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రజావాణి ముఖ్యఉద్దేశమని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి.అమరేందర్, దేవ సహాయంతో కలిసి ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 69 దరఖాస్తులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి అర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను ఎప్పటికప్పడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.