
అరకొర యూరియాతో అవస్థలు
నాగర్‌కర్నూల్ రూరల్: యూరియా కోసం అన్నదాతలు నానా పాట్లు పడుతున్నారు. రెండు బస్తాల యూరియా కోసం పీఏసీఎస్‌లు, ఆగ్రో రైతు సేవాకేంద్రాలకు నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు. చివరకు నిరాశే ఎదురవుతుండటంతో సోమవారం జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతుల ఆందోళనను విరమింపజేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కష్టపడి సాగుచేసిన పంటలకు యూరియా అందించకపోతే దిగుబడి రాదని.. 15 రోజులుగా ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకాలతో వస్తున్నా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కావాల్సిన యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. యూరియా స్టాక్ వస్తుందని.. రైతులందరికీ అందేలా చూస్తామని అధికారులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.

అరకొర యూరియాతో అవస్థలు