
8నుంచి సదరం శిబిరాలు
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ నెల 8నుంచి 24వ తేదీ వరకు సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు డీఆర్డీఓ చిన్నఓబులేషు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8, 12, 15, 19, 22, 26 తేదీల్లో శారీరక దివ్యాంగులకు, 20న వినికిడిలోపం ఉన్నవారికి, 10, 23 తేదీల్లో కంటిచూపు లోపం ఉన్న వారికి, 17, 24 తేదీల్లో మానసిక దివ్యాంగులకు సదరం శిబిరాలు ఉంటాయని పేర్కొన్నారు. శిబిరాలకు వచ్చే వారు తప్పనిసరిగా మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. నిర్ణీత తేదీ రోజున మెడికల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు.
యూరియా సరఫరాలో విఫలం : సీపీఎం
బిజినేపల్లి: రాష్ట్ర రైతాంగానికి యూరియా సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు విమర్శించారు. సోమవారం బిజినేపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియా, నానో యూరియాను ప్రభుత్వం రూ. 900 అందిస్తుండగా.. బ్లాక్ మార్కెట్‌లో రూ. 1500 వరకు విక్రయిస్తున్నారన్నారు. బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు యూరియా కొనుగోలు చేయడం రైతులకు కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వం యూరియా పంపిణీలో అనేక ఆంక్షలు పెడుతూ.. రెండు ఎకరాలకు మించి ఎంత భూమి ఉన్నా కేవలం రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తుండటంతో రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. బ్లాక్ మార్కెట్‌లో యూరియాను అధిక ధరలకు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం నాయకులు కొంపల్లి అశోక్, చంద్రశేఖర్, పరశురాం, మల్లేష్ తదితరులు ఉన్నారు.
అర్హులందరికీ
ఇందిరమ్మ ఇళ్లు
వెల్దండ: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎవరు కూడా ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లు లేని పేదలందరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు వివరించారు. మండల కేంద్రానికి మొత్తం 46 ఇళ్లు మంజూరయ్యాయని 35 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. 20 మందికి మొదటి విడతలో రూ.1. 20లక్షల నిధులు లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యాయని వివరించారు. కార్యక్రమంలో నాయకులు భూపతిరెడ్డి, మట్ట వెంకటయ్యగౌడు, బచ్చు రామకృష్ణ, ఎర్రశ్రీను ముదిరాజ్, పురుషోత్తంచారి, అలీ,బాబా, లక్ష్మణస్వామి తదితరులు ఉన్నారు.

8నుంచి సదరం శిబిరాలు