
మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి
నాగర్‌కర్నూల్ క్రైం: గిరిజన ప్రాంతాల్లో మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ డా.రవికుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో పీఎం జన్‌మన్ సంచార వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. వర్షాకాలంలో గిరిజన ప్రాంతాలకు వెళ్లే రోడ్లు కోతకు గురికావడంతో రవాణాపరంగా ఇబ్బందులు ఏర్పడుతున్న దృష్ట్యా గర్భిణులను ప్రసవ తేదీ కంటే 10 రోజుల ముందుగానే అచ్చంపేట ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. అదే విధంగా చిన్నారుల టీకాకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్రమం తప్పకుండా ఫీవర్ సర్వే నిర్వహించాలని.. జ్వరంతో బాధపడుతున్న వారి నుంచి రక్త నమూనాలను సేకరించి టీ డయాగ్నొస్టిక్ హబ్‌కు పంపించాలని సూచించారు. గిరిజన ప్రాంత ప్రజలకు సంచార వైద్యసేవలు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారి డా.లక్ష్మణ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.తారాసింగ్, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి రాజగోపాలాచారి ఉన్నారు.
● సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి శుక్రవారం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వారీగా గ్రామస్థాయిలో డ్రై డే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీరు కలుషితం కాకుండా గ్రామపంచాయతీ కార్యదర్శి, సిబ్బంది సమన్వయంతో చర్యలు తీసుకోవడంతో పాటు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేస్తున్నామన్నారు. డెంగీ బారినపడిన వారిఇంటి సమీపంలోని 100 ఇళ్లల్లో ఫీవర్ సర్వే నిర్వహించి దోమల నివారణ మందు పిచికారీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఆర్‌ఎంపీలు కేవలం ప్రథమిక చికిత్స మాత్రమే అందించాలని.. ఎవరైనా పరిధికి మించి వైద్యం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.