
సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి
నాగర్‌కర్నూల్: ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఎంపీ మల్లురవి అన్నారు. డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశానికి ఎంపీతోపాటు గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్యనాయక్, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ ఫ్లోర్ లీడర్ రాజశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన నాయకులను గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని, ఇందుకోసం త్వరలోనే నూతన కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. కాంగ్రెస్‌కు కార్యకర్తలే బలమని, అధికారంలోకి వచ్చేందుకు సైనికుల్లా పనిచేశారని, స్థానిక ఎన్నికల్లో సైతం ఇదే విధంగా పనిచేయాలని కోరారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ 30 ఏళ్ల తర్వాత నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరింది అంటే అది మీ వల్లేనన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎన్ని ఇబ్బందులూ పెట్టిన, ఎన్ని కేసులు పెట్టినా మీరు మొక్కవోని విశ్వాసంతో పార్టీ గెలుపునకు కృషిచేశారన్నారు. అలాంటి కార్యకర్తల సంక్షేమం, బాగోగుల కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.