ములుగు: జిల్లా కేంద్రంలో కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావును సోమవారం జిల్లా ఇన్‌చార్జ్ సీపీఓగా బాధ్యతలు స్వీకరించిన అసిస్టెంట్ డైరెక్టర్ బి. జవహర్‌లాల్ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ లాల్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భూసర్వేను
అడ్డుకున్న రైతులు
మంగపేట : మండల కేంద్రంలోని గోదావరి ఒడ్డు వెంట కరకట్ట నిర్మాణం కొరకు భూసేకరణలో భాగంగా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చేపట్టిన భూసర్వేను రైతులు సోమవారం అడ్డుకున్నారు. కరకట్ట నిర్మాణంలో భూసేకరణ విస్తీర్ణాన్ని సర్వేచేసేందుకు ఇరిగేషన్ అధికారులతో కలిసి రెవెన్యూ సర్వేయర్ ఎస్‌కే సఫియా సర్వే ప్రారంభించారు. కరకట్ట నిర్మాణంలో భూములను కోల్పోయిన తమకు పరిహారం ఇవ్వకుండా మల్లీ సర్వే ఏమిటి బాధిత రైతులు సర్వేకు వచ్చిన అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నిర్వహించిన సర్వే ఆధారంగా పరిహరం చెల్లించే వరకు ఎలాంటి సర్వే నిర్వహించొద్దంటూ అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు కరకట్ట నిర్మాణం పనులను సైతం నిలిపి వేయాలని వారితో పాటు వచ్చిన కరకట్ట నిర్మాణం పనులు చేపడుతున్న కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఈసందర్బంగా పలువురు బాధిత రైతులు మాట్లాడుతూ గతంలో కరకట్ట నిర్మాణానికి భూసేకరణలో భాగంగా గోదావరి ఒడ్డు నుంచి 32 మీటర్ల వెడల్పుతో రెండున్నర కిలోమీర్ల వరకు 50 నుంచి 60 ఎకరాల భూమికోసం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి హద్దులు కూడా ఏర్పాటు చేశారన్నారు. పనులు ప్రారంభించక ముందే పరిహారం చెల్లిస్తామని చెప్పి నేటికి మూడేళ్లు గడుస్తున్నా నేటికి చెల్లించలేదన్నారు. వెంటనే సర్వేను నిలిపి వేసి ఇప్పటికే భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించిన తర్వాతనే కరకట్ట పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నష్ట పరిహారం చెల్లించకుండా కరకట్ట నిర్మాణం చేపడితే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు పెందోట సత్యనారాయణ, సతీష్, కోడం రాజు, కందకట్ల రాజమౌళి, రాజన్న మరో 20 మంది రైతులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటలు
సాగుచేయాలి
ములుగు/ములుగు రూరల్: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించి, తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ పంటలు రైతులు సాగుచేసేలా ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ మహేందర్‌జీ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా రైతు సలహా మండలి సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ(ఆత్మ) 2026–27 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్)పై సమగ్రంగా చర్చించి యాక్షన్‌ప్లాన్‌ను ఆమోదించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మహేందర్‌జీ మాట్లాడారు. ప్రస్తుత సంవత్సరం ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులను ముందుగానే అప్రమత్తం చేయాలన్నారు. గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం డీఏఓ సురేశ్‌కుమార్ మాట్లాడుతూ 2026–27 సంవత్సరానికి సంబంధించి ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు అమలు చేయనున్న శిక్షణ కార్యక్రమాలు, రైతు ప్రదర్శన క్షేత్రాలు, అవగాహన కార్యక్రమాలు, రైతుల అధ్యయన పర్యటనలు, సాంకేతిక విజ్ఞాన విస్తరణ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సమావేశంలో ఆత్మకమిటీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


