● ఆదివాసీల హక్కులు హరిస్తే ఊరుకోం
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ,
మాజీ ఎంపీ మిడియం బాబురావు
ఏటూరునాగారం: ఆదివాసీల భూములకు అటవీ హక్కుల చట్టం–2006 ప్రకారం వెంటనే హక్కు పత్రాలు ఇవ్వాలని, ఆదివాసీల హక్కులను కాలరాస్తే ఊరుకోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, మాజీ ఎంపీ మిడియం బాబురావు అన్నారు. మండల కేంద్రంలో పోడు భూములలో కందకాలు తీయవద్దని, ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని సీపీఎం ఆధ్వర్యంలో ఆదివాసీలు వేలాది మంది డోలు వాయిద్యాలతో సోమవారం వై జంక్షన్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి ఐటీడీఏను ముట్టడించారు. పీఓ లెనిన్ వత్సల్ టొప్పో స్పందించి నాయకులను చర్చలకు ఆహ్వానించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజనుల సమస్యల పై చర్చలు సాగిన అనంతరం పీఓ బయటకు వచ్చి వినతిపత్రం స్వీకరించి మాట్లాడారు. ఆదివాసీల సమస్యలను పరిష్కరించడానికి తాము సానుకూలంగా ఉన్నామని సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, మాజీ ఎంపీ మిడియం బాబురావు మాట్లాడుతూ ఆదివాసీలు దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములపై చట్టబద్ధమైన హక్కులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. 11 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే కేవలం 4 లక్షల మందికే హక్కు పత్రాలను ఇచ్చి గత ప్రభుత్వం చేతులు దులుపుతుందని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వస్తే గిరిజనులు, గిరిజనేతరులందరికీ హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి నేటికీ ఇవ్వడం లేదన్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులు రెచ్చిపోయి ఆదివాసీలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. 1/70 చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చేందుకు చేస్తున్న కుట్రలను ఆదివాసీలు ఐక్యంగా తిప్పికొట్టాలని వెల్లడించారు. అదేవిధంగా జీవో నంబర్ 3ను వెంటనే పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి బి. సాంబశివ , కార్యదర్శివర్గ సభ్యులు ఎండి దావూద్, రత్నం రాజేందర్ , గ్యానం వాసు , చిట్టిబాబు, రఘుపతి, గొంది రాజేశ్, చిరంజీవి, దామోదర్, కుమ్మరి శ్రీను గిరిజనులు పాల్గొన్నారు.


