రామప్ప సాగునీటిపై సందిగ్ధం | - | Sakshi
Sakshi News home page

రామప్ప సాగునీటిపై సందిగ్ధం

Jul 28 2026 1:24 AM | Updated on Jul 28 2026 1:24 AM

వెంకటాపురం(ఎం): రామప్ప సరస్సు నుంచి ఆయకట్టు పొలాలకు అందించే సాగునీటిపై సందిగ్ధం నెలకొంది. ప్రతిఏటా సరస్సు కింద రెండు పంటలు పండించుకుంటున్న రైతాంగానికి ఎల్‌నినో ప్రభావం రైతన్నలను కలవరపెడుతుంది. రామప్ప సరస్సు కింద అధికారికంగా 5,180 ఎకరాలు, అనధికారికంగా మరో 5 వేల ఎకరాల వరిపంట సాగువుతుంది. వానాకాలం సాగు కోసం గత నెల 29న పాలంపేట రైతు వేదికలో ఇరిగేషన్‌ అధికారులు రైతులతో సమావేశం నిర్వహించి సరస్సు కింద పూర్తి ఆయకట్టు సాగయ్యేలా తైబందీ ఖరారు చేశారు. పంట పొలాలకు సరస్సు కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేయడంతో రైతులు సైతం నార్లు పోసుకొని సుమారు 800 ఎకరాల్లో వరినాట్లు వేశారు. ఎల్‌నినో ప్రభావంతో రామప్ప సరస్సు కింద ఆయకట్టు పొలాలకు సాగునీటి సరఫరాను నిలిపివేయాలని ఉన్నతాధికారుల ఆదేశానుసారంతో ఇరిగేషన్‌ అధికారులు ఈనెల 20న నీటిని నిలిపివేశారు. నారు పోసుకునేంందుకు నీరిచ్చి నాట్లు వేసుకునేందుకు నీరు ఎందుకు ఇవ్వరంటూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పెద్దమొత్తంలో ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు. కలెక్టర్‌కు సైతం వినతిపత్రం అందించారు.

24న నీటి విడుదల..

రామప్ప సరస్సు కింద ఆయకట్టు రైతులకు బీఆర్‌ఎస్‌ నాయకులు కావాలనే తప్పుడు సంకేతాలు ఇస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటూ ఈ నెల 24న ఇరిగేషన్‌ అధికారులతో సరస్సు నీటిని ఆయకట్టు పొలాలకు విడుదల చేయించారు. దీంతో ఆయకట్టు రైతాంగం ఆశతో మరో 300 ఎకరాల్లో వరినాట్లు వేశారు. మూడు రోజులు గడవక ముందే మళ్లీ సరస్సు నీటిని ఇరిగేషన్‌ ఉన్నతాధికారుల ఆదేశానుసారం సిబ్బంది సోమవారం ఉదయం సాగునీటిని నిలిపివేశారు. దీంతో వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలను సాగు చేసి నాట్లు వేశామని, సాగునీటిని నిలిపివేస్తే వేసిన వరినాట్లు, నారుమడులు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్‌ అధికారులను సాక్షి వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశానుసారంతోనే సరస్సు నీటిని నిలిపివేశామని, ఆయకట్టు రైతులు వరిపంట బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

సరస్సు నీటిని నిలిపివేసిన

ఇరిగేషన్‌ అధికారులు

ఆందోళనలో ఆయకట్టు రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement