రేషన్‌ దందా | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ దందా

Apr 8 2026 7:38 AM | Updated on Apr 8 2026 7:38 AM

రేషన్‌ దందా

నగదు కేంద్రాలుగా మారిన దుకాణాలు

అధికారుల నిర్లక్ష్యం

ములుగు: బియ్యం మారినా డీలర్ల తీరు మారలేదు. అదే చేతివాటం.. అదే తప్పుదారి.. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న ఉచిత సన్న బియ్యం నగదు దందా జిల్లాలో బాహాటంగా కొనసాగుతోంది. ఆహార భద్రత (రేషన్‌) కార్డుదారులు సన్న బియ్యంపై కూడా అనాసక్తి కనబర్చకపోవడం డీలర్లకు కలిసివస్తోంది. కొందరు కార్డుదారులు ఈ–పాస్‌ యంత్రంపై బయోమెట్రిక్‌ (వేలిముద్ర) పెట్టి నెలవారి బియ్యం కోటాను డీలర్లకు అప్పగించి నగదు పుచ్చుకోవడం, డీలర్లు కూడా కిలోకు రూ.12 చొప్పున లెక్కకట్టి నగదు అందించడం సర్వసాధారణమైంది. జిల్లాలో 222 రేషన్‌ షాపులు ఉండగా మెజార్టీ రేషన్‌ దుకాణాల్లో ఇదే తంతు కొనసాగుతోంది.

సన్నబియ్యం పంపిణీ జరుగుతున్నా..

పూట గడవని అత్యంత నిరుపేద కుటుంబాలు మినహా మిగతా కుటుంబాలు పీడీఎస్‌ బియ్యం వండుకొని తినడానికి పెద్దగా ఆసక్తి కనబర్చరు. మొన్నటి వరకు బియ్యం దొడ్డుగా, నాసిరకం, ముక్కి పోయి ఉండటం, వండి తిన్న తర్వాత జీర్ణం కాకపోవడం లాంటి కారణాలతో పెద్దగా ఆసక్తి కనబర్చేవారు కాదు. కొన్ని కుటుంబాలు మాత్రం రేషన్‌ బియ్యాన్ని కేవలం ఇడ్లి, దోశలు, పిండి వంటలకు వినియోగిస్తున్నారు. ప్రతినెలా ఉచితంగా అందుతుండటం, అవసరానికి మించి వస్తుండటంతో డీలర్లకు అప్పగిస్తూ వచ్చేవారు. సన్నబియ్యం పంపిణీ జరుగుతున్నా లబ్ధిదారులను డీలర్లు తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు

ఉన్నాయి.

10 మండలాలు.. 222 దుకాణాలు

జిల్లాలోని 10 మండలాల పరిధిలో 222 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వేసవి కాలం దృష్ట్యా లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలలకు చెందిన బియ్యాన్ని అందిస్తున్నారు. జిల్లాలో సుమారు 1.02 లక్షల కార్డుదారులు ఉండగా 5,490 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. మూడు నెలల బియ్యానికి సంబంధించిన పంపిణీ ప్రారంభమైనప్పటికి లబ్ధిదారులు మూడు సార్లు వేలిముద్రలు వేసి రేషన్‌ డీలర్లకే కిలోకి రూ.12ల చొప్పున సన్నబియ్యాన్ని విక్రయిస్తున్నారు. రేషన్‌ షాపుల్లోనే సదరు డీలర్లు నగదును లబ్ధిదారులకు పంపిణీ చేసి సన్నబియ్యాన్ని తమ దగ్గరనే నిల్వ చేసుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలో 222 రేషన్‌ షాపులు ఉండగా దాదాపు 100 షాపులకు పైగా రేషన్‌ షాపుల్లో ఇదే దందా కొనసాగుతున్నట్లు సమాచారం.

కిలో సన్నబియ్యం రూ.12కు కొనుగోలు చేస్తున్న డీలర్లు

లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకుని నగదు చెల్లింపు

డీలర్లకు కలిసొచ్చిన మూడు నెలల కోట

నిరుపేద లబ్ధిదారులకు సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. రేషన్‌ షాపులపై నిఘా లేకపోవడం, డీలర్లు ఇచ్చే మామూళ్లకు అధికారులు అలవాటు పడడంతో రేషన్‌ దుకాణాల వైపు కన్నెత్తి చూసే వారే కరవయ్యారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సన్నబియ్యాన్ని నల్ల బజారుకు తరలించే రేషన్‌ దుకాణాలపై దాడులు నిర్వహించి డీలర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement