ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం

Apr 8 2026 7:38 AM | Updated on Apr 8 2026 7:38 AM

ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం

ములుగు: ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యమని, శాస్త్ర విజ్ఞానంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి కృషి చేస్తున్నామని కలెక్టర్‌ టీఎస్‌.దివాకర తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి వద్ద ఆరోగ్య అవగాహన ర్యాలీని కలెక్టర్‌ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి నుంచి డీఎల్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆరోగ్యం కోసం కలిసి, శాస్త్రానికి మద్దతుగా నిలబడండి (టుగెదర్‌ ఫర్‌ హెల్త్‌, స్టాండ్‌ విత్‌ సైన్స్‌) అనే థీమ్‌ తో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం, పోషకాహారము మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. దుర అలవాట్లకు దూరంగా ఉండడంతో పాటు ఆరోగ్య సూత్రాలను పాటించాలని ప్రజలకు సూచించారు. అపోహలు, మూఢ నమ్మకాలకు నమ్మవద్దని వెల్లడించారు. శాస్త్రపరమైన అవగాహనతో ముందుకు సాగితేనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని వెల్లడించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ గోపాల్‌ రావు మాట్లాడుతూ ఆరోగ్య, ఆశ కార్యకర్తలు గ్రామాల్లో ఆరోగ్యం గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం జిల్లా సాంస్కృతిక కళాజాతా బృందం ఆరోగ్య సూత్రాల మీద పాటలు పాడుతూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ జగదీశ్వర్‌, ప్రోగ్రాం అధికారులు శ్రీకాంత్‌, నాగఅన్వేష్‌, మున్సిపాలిటీ కమిషనర్‌ రమేశ్‌, మాస్‌ మీడియా అధికారి సంపత్‌, ప్రోగ్రాం మానిటరింగ్‌ సూపర్‌వైజర్లు వెంకట్‌ రెడ్డి, సురేశ్‌బాబు, ఫార్మసీ జిల్లా స్టోర్‌ ఇన్‌చార్జ్‌ వినోదర్‌, హెచ్‌ఇ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎం గోదాం తనిఖీ

కలెక్టరేట్‌ ఆవరణలోని ఈవీఎం గోదాంను మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్‌ దివాకర తనిఖీ చేశారు. గోదాంలో అమర్చిన సీసీ కెమెరాల పనితీరును, అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా ఏర్పాటు చేసిన ఫైర్‌ ఎక్స్‌టింగిషర్‌ను, ఇతర అగ్నిమాపక పరికరాలను తనిఖీ చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి తగిన సూచనలు అందజేశారు. గోదాం వద్ద ఉన్న పోలీస్‌ బందోబస్తును, రిజిస్టర్లను పరిశీలించారు. భద్రత విషయంలో అలసత్వం వహించకూడదని సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఈవీఎంల భద్రత విషయంలో పారదర్శకతను పాటిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎలక్షన్‌ సెల్‌ సూపరింటెండెంట్‌ సలీం, డిటీ నితీష్‌ కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ మనోహర్‌, నాయకులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ టీఎస్‌.దివాకర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement