– మరిన్ని ఫొటోలు 11లోu
42శాతం రిజర్వేషన్ల కోసం డిమాండ్
ములుగు/ములుగు రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ శనివారం ఇచ్చిన బంద్ సక్సెస్ అయింది. ఈ మేరకు జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో బీసీ సంఘాల నాయకులతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, వామపక్ష పార్టీల నాయకులు ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను మూసివేయించారు. బంద్‌లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ములుగు జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలుపై బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవియాదవ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం చేసి బిల్లు పంపిస్తే కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుండా ద్వంద వైఖరి ప్రదర్శిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, మండల అధ్యక్షుడు చాంద్‌పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు పౌడాల ఓంప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ములుగు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అలాగే సీపీఎం, ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ, నాయకులు తుమ్మల వెంకట్‌రెడ్డి, రత్నం రాజేందర్, గఫూర్, రాజు, ఐలయ్య, రవిగౌడ్, తదితరులు పాల్గొన్నారు. బీసీ జేఏసీ పిలుపులో భాగంగా బీజేపీ నాయకులు బంద్‌లో పాల్గొని జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తుందని అరోపించారు. కార్యక్రమంలో నాయకులు భూక్య జవహర్‌లాల్, నగరపు రమేష్, రవీంద్రాచారి, కృష్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపార సముదాయాలు
జిల్లాలో స్తంభించిన రాకపోకలు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీల మద్దతు
ర్యాలీలు, రాస్తారోకోలు
మండలాల వారీగా బంద్ సాగిందిలా..
ఏటూరునాగారం: మండల కేంద్రంలో చేపట్టిన బంద్‌లో బీసీ సంఘాలతో పాటు సీపీఎం, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ప్రజా సంఘాల నాయకులు రామాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు రవి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు యాకూబ్, డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కర్నే లాజర్, కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యుడు గోగు మల్లయ్య, వ్యకాస మండల కమిటీ సభ్యుడు నాయిని కృష్ణ, సప్పిడి రాంనర్సయ్య, బట్టు గోపి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
మంగపేట: బీసీ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, కుల సంఘాలతో పాటు వ్యాపార వాణిజ్య సంస్థలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా నాయకులు బ్రాహ్మణపల్లి అటవీశాఖ చెక్ పోస్టు నుంచి కమలాపురం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి మద్దతు తెలిపారు. శుక్రవారం రాత్రి మండల కేంద్రంలో నైట్‌హాల్ట్‌కు వచ్చిన ఆర్టీసీ బస్సులు సాయంత్రం బంద్ ముగిసే వరకు నిలిచిపోయాయి.
గోవిందరావుపేట: బంద్‌లో భాగంగా వ్యాపార వాణిజ్య సంస్థలు, హోటళ్లు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐలు బంద్‌లో పాల్గొన్నాయి.
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండలంలో మేడారం, నార్లాపూర్, కాటాపూర్, తాడ్వాయి గ్రామాల్లోని వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
కన్నాయిగూడెం: బీసీ జేఏసీ మండల అధ్యక్షుడు ముదురుకోళ్ల భిక్షపతి ఆధ్వర్యంలో బీసీ నేతలు వ్యాపార సముదాయాలతో పాటు పాఠశాలలను మూసివేయాలని కోరగా స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. కార్యక్రమంలో బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
వెంకటాపురం(కె): హోటళ్లు, కిరాణషాపులు, బట్టల షాపులు, పాఠశాలలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు మద్దతు ఇచ్చారు. అటోలు, బస్సులు తిరగలేదు. పెట్రోల్ బంక్‌లు సైతం తెరుచుకోలేదు. వాడబలిజసేవా సంఘం, మున్నూరు కాపు, పెరిక బీసీ సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.అంబేడ్కర్ సెంటర్‌లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ బంద్‌లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ బంద్‌కు మద్దతు తెలిపి బంద్‌లో పాల్గొన్నాయి.
వాజేడు: బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎంతో పాటు తదితర పార్టీలు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. జగన్నాథపురం, పెద్ద గొళ్లగూడెం గ్రామాల వద్ద హైదరాబాద్– భూపాలపట్నం 163 నంబర్ జాతీయ రాహదారిపై నాయకులు బైఠాయించారు. సుమారు నాలుగు గంటల పాటు రహదారిపై బైఠాయించడంతో పలు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
బీసీ బంద్ సక్సెస్
బీసీ బంద్ సక్సెస్