
మద్యం షాపులకు 1,500 దరఖాస్తులు
ములుగు/భూపాలపల్లి: మద్యం షాపులకు టెండర్లు హోరెత్తాయి. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం రోజు నుంచి అప్లికేషన్లు అంతంత మాత్రంగానే రాగా.. చివరి రోజు శనివారం మాత్రం భారీగా వచ్చాయి. తొలుత వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి టెండర్లు వేయడం లేదని భావించినప్పటికీ, దరఖాస్తు రుసుం పెంచినందునే వెనుకంజ వేసినట్లు తెలిసింది. చివరకు పాత వ్యాపారులంతా రంగంలోకి దిగారు.
ఒకేరోజు 879 అప్లికేషన్లు..
జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని భూపాలపల్లి, కాటారం, ములుగు, ఏటూరునాగారం సర్కిల్ పరిధిలో 59 మద్యం షాపులకు ప్రభుత్వం గత నెల 26వ తేదీ నుంచి టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 17వ తేదీ వరకు కేవలం 621 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. చివరి రోజు శనివారం రాత్రి 10.30 గంటల వరకు 879 వచ్చినట్లు ఎకై ్సజ్ అధికారులు వెల్లడించారు. ఏటూరునాగారం సర్కిల్ పరిధిలో టెండర్లు వేసే వారు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. దీంతో రెండు జిల్లాల్లో మొత్తం సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
సర్కారు ఆదాయం పెరిగింది..
రాష్ట్ర ప్రభుత్వం 2023లో రూ.2 లక్షల అప్లికేషన్ ఫీజులో మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా రెండు జిల్లాల నుంచి మొత్తం 2,161 అప్లికేషన్లు వచ్చాయి. వాటి ద్వారా రూ.43.22 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది దరఖాస్తు రుసుమును రూ.3 లక్షలకు పెంచగా శనివారం రాత్రి 11 గంటల వరకు వచ్చిన అప్లికేషన్ల లెక్కల ప్రకారం ప్రభుత్వానికి సుమారు రూ.45 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అప్లికేషన్ల సంఖ్య తగ్గినప్పటికీ సర్కారుకు ఆదాయం పెరిగింది.
రెండు షాపులకు నిల్..
ఏటూరునాగారం సర్కిల్ పరిధిలో ఎస్టీ కేటగిరికి రిజర్వ్ చేసిన గెజిట్ 49, 50 నంబరు గల మద్యం షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. 52, 53, 54, 55 షాపులకు ఒకటి చొప్పున రాగా 58వ షాపుకు రెండు చొప్పున అప్లికేషన్లు వచ్చాయి. కాగా ఆయా షాపులకు సైతం శనివారం రాత్రి వరకు దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ఎకై ్సజ్ అధికారులు వెల్లడించారు.
ములుగు, భూపాలపల్లి జిల్లాలకు పోటెత్తిన అప్లికేషన్లు
శనివారం ఒక్కరోజే 879..
అర్ధరాత్రి వరకు కొనసాగిన దరఖాస్తుల స్వీకరణ
గతేడాది 2,161 రాక..
ఈ ఏడాది తగ్గినా.. పెరిగిన ఆదాయం