
సర్వేలో ప్రతిఒక్కరూ పాల్గొనాలి
ములుగు రూరల్: తెలంగాణ రైజింగ్ విజన్ –2047 సర్వేలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ టీఎస్.దివాకర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షకు అనుగుణంగా డాక్యుమెంటును రూపొందించడంలో పౌరులందరూ పాల్గొనేలా సిటిజన్ సర్వే చేపట్టారని వివరించారు. దానికి అనుగుణంగా ఈ నెల 10న సర్వే ప్రారంభమైందని తెలిపారు. ఈ సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొని సలహాలు, సూచనలు ప్రజలకు అందించాలని ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేసిందని తెలిపారు. ఈ నెల 25వరకు కొనసాగే సర్వేలో ఉద్యోగులు పాల్గొనడంతో పాటు సర్వే లింక్ క్యూర్ కోడ్‌ను కార్యాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు. హెచ్‌టీటీపీ//డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. తెలంగాణ.జీఓవీ.ఇన్/తెలంగాణరైజింగ్/లింక్ ద్వారా పాల్గొనాలని సూచించారు.
రూ 1.89 లక్షల విలువైన బాణసంచా స్వాధీనం
మంగపేట: మండల పరిధిలోని కమలాపురం గ్రామానికి చెందిన తాటిపల్లి రాజేందర్ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రూ.1,89,265 లక్షల విలువైన దీపావళి బాణసంచా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై టీవీఆర్ సూరి తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. రాజేందర్ ఆంధ్రప్రదేశ్‌లోని చిలుకలూరిపేటలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి తక్కువ ధరకు దీపావళి బాణసంచా కొనుగోలు చేసి అక్రమంగా ఇంట్లో నిల్వ చేశాడు. ఈ మేరకు అందిన సమాచారం మేరకు రైడ్ చేసి బాణసంచా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ట్రాక్టర్ స్వాధీనం
మంగపేట : మండల పరిధిలోని తిమ్మంపేట బీట్ పరిధిలో పోడు చేస్తున్న ట్రాక్టర్‌ను శనివారం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు మంగపేట అటవీశాఖ రేంజ్ అధికారి అశోక్ తెలిపారు. అశోక్ కథనం ప్రకారం.. తిమ్మంపేట బీటు పరిధిలోని కంపార్ట్‌మెంట్ నంబర్ 4ఏ డీఆర్‌ఓ సుజాత, బీటాఫీసర్ సౌజన్య బేస్ క్యాంప్ సిబ్బందితో గస్తీ నిర్వహిస్తుండగా ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూమిలో ట్రాక్టర్ నిలిపి ఉంది. అనుమానంతో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా భూమిని పరిశీలించగా అదనంగా మరో ఎకరం ఆక్రమించి ట్రాక్టర్‌తో పోడు చేసినట్లుగా గుర్తించినట్లు వెల్లడించారు. పోడుకోసం వినియోగించిన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని మంగపేట రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు వివరించారు. అక్రమంగా పోడు చేసిన బాలన్నగూడెంకు చెందిన ట్రాక్టర్ యజమాని పోడెం రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు రేంజ్ అధికారి తెలిపారు.

సర్వేలో ప్రతిఒక్కరూ పాల్గొనాలి

సర్వేలో ప్రతిఒక్కరూ పాల్గొనాలి