
గొత్తికోయలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం
● ఏఐసీసీ అబ్జర్వర్ అబ్రహం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: గొత్తికోయ గిరిజనులకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఏఐసీసీ అబ్జర్వర్ జాన్సన్ అబ్రహం అన్నారు. మండల పరిధిలోని మండలతోగు గొత్తికోయ గూడేన్ని ఆయన పార్టీ నాయకులతో కలిసి శనివారం సందర్శించారు. గూడెంలో నివసిస్తున్న గొత్తికోయ గిరిజనులతో మాట్లాడి వారి జీవనస్థితిగతులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులో వైద్య సేవలందించాలని మంత్రి సీతక్క చోరవతో నర్సాపూర్‌లో కంటైనర్ ఆస్పత్రి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిల్లలను పాఠశాలలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. గొత్తికోయల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. గొత్తికోయలకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కల్యాణి, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్, కార్మిక శాఖ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
రామప్పలో విదేశీయుల సందడి
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో శిక్షణ పొందుతున్న టాంజనియా దేశానికి చెందిన 30 మంది అధికారులు సందర్శించారు. ప్రొఫెసర్, కోర్స్ డైరెక్టర్ డాక్టర్ రావులపాటి మాధవి ఆధ్వర్యంలో వారు రామప్ప ఆలయానికి చేరుకొని రామలింగేశ్వస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్‌లు వారికి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని వారు కొనియాడారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి సరస్సులో బోటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఎంసీహెచ్‌ఆర్‌డీ అధికారులు రవి, సాయికృష్ణ, నందకిశోర్ తదితరులు పాల్గొన్నారు.

గొత్తికోయలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం