
రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
ములుగు: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా జిల్లాలోని రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. శుక్రవారం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని రౌడీ షీటర్లకు ప్రతీ నెల క్రమం తప్పకుండా ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని, వారి కదలికలపై నిఘా ఉంచాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత సంవత్సరకాలంగా సత్ప్రవర్తన కలిగిన 20 మందిపై రౌడీషీట్, 53 మందిపై సస్పెక్ట్ షీట్‌లు ఎత్తివేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లలో 69 మంది రౌడీ షీటర్లు, 128 మంది సస్పెక్ట్ షీటర్లకు శుక్రవారం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించినట్లు వెల్లడించారు.
విధుల్లో చేరిన
టూరిస్టు పోలీసులు
వెంకటాపురం(ఎం): తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ పర్యాటక క్షేత్రాల్లో పర్యాటకుల రక్షణ, సహాయం కోసం 80 మంది టూరిస్టు పోలీసులను నియమించింది. ఇందులో భాగంగా జిల్లాకు 10 మంది టూరిస్టు పోలీసులు వచ్చారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఆరుగురు, ప్రపంచ పర్యాటక క్షేత్రమైన రామప్ప ఆలయానికి నలుగురు టూరిస్టు పోలీసులను కేటాయించగా శుక్రవారం వారు విధుల్లో చేరారు. పర్యాటకుల రక్షణ కోసం సేవలందించనున్నారు.
మత్తుమందులు
విక్రయిస్తే చర్యలు
ములుగు రూరల్: మెడికల్ షాపుల్లో మత్తుమందులు విక్రయిస్తే చర్యలు తప్పవని వరంగల్ జౌషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న అక్రమ మందుల అమ్మకాలను అరికట్టేందుకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెలి పారు. మందుల చీటీలు లేకుండా అబార్షన్ కిట్లు, నిద్ర మాత్రలు అనుమానాస్పద మందులు విక్రయించినట్లయితే 180059969969 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్