
‘పది’ ఫలితాలపై ప్రత్యేక దృష్టి
● జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి
వెంకటాపురం(కె): జిల్లాలో పదో తరగతి ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి అన్నారు. గురువారం మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా డీఈఓ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పాఠశాలల హెచ్‌ఎంలతో పాఠశాల పరిస్థితులు, విద్యారంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. బడి మానేసిన పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలలకు వచ్చే విధంగా చర్యలు చేపడుతామని తెలిపారు. గత విద్యాసంవత్సరం పదో తరగతిలో 97.4 శాతం ఉత్తీర్ణత సాధించామని వివరించారు. ఈ ఏడాది నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తామని వివరించారు. వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం మండలాల పై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. హాస్టల్స్, మోడల్ స్కూల్స్, కేజీబీవీలకు గ్యాస్, గుడ్ల సరఫరా ప్రారంభమైందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉల్లాస్ జిల్లా కో ఆర్డినేటర్ కృష్ణబాబు, ఎంఈఓ జీవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.