
మేడారం వెళ్లేదెలా?
నార్లాపూర్ చెక్‌పోస్టు నుంచి కాల్వపల్లి వరకు..
పలుచోట్ల
గుంతలమయంగా రోడ్లు
ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏజెన్సీలోని రోడ్లు పలుచోట్ల గుంతలమయంగా మారాయి. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న మహాజాతరకు వచ్చే భక్తులకు కూడా కష్టాలు తప్పేలా లేవు. ఏటూరునాగారం, ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలాల నుంచి మేడారం వెళ్లే పలు రోడ్లు దెబ్బతిన్నాయి. వాహనాలు ఎక్కడ బోల్తా పడుతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
మూడు కిలోమీటర్లు అధ్వానం
ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి, షాపెల్లి, దొడ్ల, కొండాయి, మల్యాల, ఊరట్టం మీదుగా మేడారం జాతరకు వెళ్లేందుకు ఈ రోడ్డును అధికారులు ప్రైవేట్ వాహనాలకు కేటాయించారు. ప్రతిఏటా మేడారానికి ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు, ఒడిశా ప్రాంతాలకు చెందిన ప్రైవేట్ వాహనాలు మేడారం జాతరకు ఈ దారిగుండానే వెళ్తుంటారు. అయితే చిన్నబోయినపల్లి నుంచి దొడ్ల వరకు బీటీ రోడ్డు ఉన్నప్పటికీ మూడు కిలోమీటర్ల మేరకు రోడ్డు గుంతలమయంగా మారింది. దొడ్ల– కొండాయి గ్రామాల మధ్య ఉన్న జంపన్నవాగు ఉప్పొంగి ప్రవహించడంతో బ్రిడ్జి 2023లో కొట్టుకుపోయింది. ఆ తర్వాత అక్కడ తాత్కాలిక డైవర్షన్ రోడ్లు నిర్మిస్తున్నప్పటికీ వర్షాలు పడడంతో కొట్టుకుపోయి షరా మాములుగానే మారిపోయింది. దీంతో వాగవతలి గ్రామాల ప్రజలు పడవలు, ప్లాస్టిక్ బుడగలను పట్టుకొని వాగు దాటే పరిస్థితి నెలకొంది.
మరమ్మతులకు రూ.కోటి మంజూరు
చిన్నబోయినపల్లి నుంచి దొడ్ల వరకు 12.5 కిలోమీటర్ల వరకు ఉన్న బీటీ రోడ్డు ప్యాచ్ వర్కులు, ఇతర మరమ్మతుల కోసం ఆర్‌అండ్‌బీ శాఖ నుంచి రూ. 40 లక్షలు కేటాయించారు. అలాగే కొండాయి–దొడ్ల మధ్యలో ఉన్న జంపన్నవాగు వద్ద ప్రైవేట్ వాహనాలు జాతరకు వెళ్లేందుకు రూ.60 లక్షలు ఆర్‌అండ్‌బీ ద్వారా కేటాయించారు. ఈ పనులు ఇంకా మొదలు కాలేదు. ఇంకా నాలుగు నెలలు మాత్రమే మేడారం జాతరకు సమయం ఉన్నప్పటికీ పనులు మొదలు పెట్టకపోవడంతో భక్తులకు ఈసారి కష్టాలు తప్పేలా లేవు.
జంపన్నవాగు నుంచి
అమ్మవార్ల గద్దెల వరకు..
అదే విధంగా మేడారంలోని జంపన్నవాగు నుంచి అమ్మవార్ల గద్దెల వరకు ఉన్న బీటీ రోడ్డు గుంతలుగా మారి అధ్వానంగా తయారైంది. అమ్మవార్ల గద్దెలకు కూతవేటు దూరంలోనే గుంతలు పడిన రోడ్డు మరమ్మతులకు నోచుకోపోవడంతో అధికారుల పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారంలో నాలుగైదు సార్లు జాతర అభివృద్ధి పనుల ఏర్పాట్ల పరిశీలనకు కలెక్టర్ నుంచి మొదలుకుని జిల్లా అధికారులు మేడారాన్ని సందర్శిస్తుంటారు. జంపన్నవాగు నుంచి మేడారానికి వచ్చే ప్రధాన దారిలోనే రోడ్డు గుంతలు పడి నీరు నిలిచి ప్రమాదకరంగా ఉంది. మేడారంలో నిత్యం పర్యటిస్తున్న అధికారులు కనీసం తాత్కాలికంగా రోడ్డుకు మరమ్మతులు చేపట్టక పోవడం గమనార్హం. గుంతలు పడిన రోడ్డుపై నుంచి భక్తులు వాహనాల్లో వెళ్లేందుకు జాగ్రత్త పడాల్సి వస్తోంది.
ఎస్‌ఎస్‌తాడ్వాయి మండల పరిధిలోని నార్లాపూర్ చెక్ పోస్టు నుంచి కాల్వపల్లి వరకు ఐదు కిలోమీటర్ల దూరంలోని రోడ్డుపై అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తాడ్వాయి–పస్రా మధ్యలోని జలగలంచ బ్రిడ్జి వాగు వరద తాకిడికి దెబ్బతినగా తాడ్వాయి మీదుగా మేడారం నుంచి భారీ వాహనాలతో పాటు ఇసుక లారీలను మళ్లించారు. నార్లాపూర్ చెక్ పోస్టు నుంచి కాల్వపల్లి మీదుగా కాటారం వైపు ఇసుక లారీలు వెళ్లడంతో రోడ్డు ధ్వంసమై గుంతలుగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం నుంచి కాల్వపల్లి మీదుగా మేడారానికి భక్తుల వాహనాలతోపాటు ఇతర వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు ధ్వంసమవడంతో రాత్రి వేళ వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరిగే అస్కారం ఉంది. ద్విచక్ర వాహనాదారులు రాత్రి వేళలో రోడ్డుపై వెళ్లేందుకు ప్రాణసంకటంగా మారింది.
కొండాయి వాగు వద్ద కూలిపోయిన బ్రిడ్జి
మహాజాతరకు సమీపిస్తున్న గడువు
మరమ్మతులపై దృష్టి సారించని అధికారులు
ఈ సారి భక్తులకు తప్పని తిప్పలు

మేడారం వెళ్లేదెలా?

మేడారం వెళ్లేదెలా?

మేడారం వెళ్లేదెలా?