
చుక్క.. ముక్క ఎట్లా?
మద్యం, మాంసం
విక్రయాలపై చర్చ
● మద్యం షాపులను మూసివేయనున్న ప్రభుత్వం
● మాంసం విక్రయాలపై
వ్యాపారుల సందిగ్ధం
ములుగు: దసరా పండుగంటేనే అందరికీ సంబురం. చిన్న చితక కూలీ నుంచి మొదలుకొని ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతిఒక్కరూ ఇంటిల్లిపాది కోసం మాంసం వండుకొని పండుగ పూట తింటారు. తెలంగాణలో దసరా పండుగ అంటేనే మద్యానికి మరో ప్రత్యేకత ఉంటుంది. మాంసం, మద్యం లేనిదే కిక్కు ఉండదు. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. చుక్క, ముక్కలేనిదే గుక్కె డు బువ్వ కూడా లోపలకి పోదనే సామెతకు తగ్గట్టుగా దసరా పండుగ ఉంటుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున దసరా వస్తుండడంతో మద్యం, మాంసం ప్రియులు ఆలోచనలో పడ్డారు. పండుగ వేళ మద్యంతో పాటు మటన్, చికెన్ కావాల్సిందే అంటూ ముందస్తు కొనుగోళ్లకు సిద్ధపడుతున్నారు.
గ్రామాల్లోకి డోర్ డెలివరీ
మద్యం షాపు నిర్వాహకులు ముందస్తుగానే మద్యాన్ని గ్రామాలకు తరలిస్తున్నారు. గ్రామాల్లోని ప్రతి బెల్ట్‌షాపునకు మద్యాన్ని ప్రత్యేక ఆటోల ద్వారా తరలిస్తూ డోర్ డెలివరీ చేస్తున్నారు. జిల్లాలో 25 మద్యం షాపులు ఉండగా వాటి పరిధిలో సుమారు రెండు వేలకు పైగా బెల్ట్‌షాపులు ఉన్నాయి. ప్రతినెలా ఎకై ్సజ్ శాఖతో పాటు మరో శాఖకు 25 షాపుల నుంచి అక్షరాలా రూ.40 లక్షలు మామూళ్లు వెళ్తుండడంతో ఆ శాఖల అధికారులు బెల్ట్‌షాపులను మామూలుగానే తీసుకుంటున్నారు. జిల్లాలోని వాజేడు, వెంకటాపురం(కె) మండలంలో మద్యం వ్యాపారులు సాయంత్రంలోగా మద్యాన్ని బెల్ట్‌షాపులకు తరలించి సాయంత్రం 6 గంటలలోపే మద్యం షాపులను మూసి వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అయోమయంలో వ్యాపారులు
దసరా పండుగకు ప్రతిఇంట్లో మాంసహారం ఉండాల్సిందే. ఇందుకోసం చికెన్, మటన్ వ్యాపారుల వద్ద తెల్లవారుజాము నుంచే షాపుల వద్ద ప్రజలు క్యూ కడతారు. మరికొంతమంది కాలనీవాసులు, వీధుల్లోని ప్రజలు ఒక సమూహంగా ఏర్పడి గొర్రెలను, మేకలను కొనుగోలు చేసి బుధవారం రాత్రి నుంచే యాటలను కోసుకుని పోగులు పంచుకుంటారు. ఇప్పటికే గ్రామాల్లో గొర్లు, మేకపోతులు కొనుగోలు చేసినప్పటికీ కోయడం ఎట్లా అని అయోమయంలో ప్రజలు ఉన్నారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో సుమారు 100కు పైగా మటన్, చికెన్ దుకాణాలు ఉండగా దసరా రోజున కోటి రూపాయాలకు పైగా వ్యాపారం జరుగుతుంది. దసరా పండుగ రోజు గాంధీ జయంతి కావడంతో తాము నష్టపోతామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్టోబర్ 2వ తేదీ(గురువారం) గాంధీజయంతి ఉండడంతో మద్యం, మాంసం విక్రయాలపై జిల్లాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలతో పాటు మాంసం దుకాణాలు మూసివేయడం ఆనవాయితీగా వస్తుంది. కాకపోతే అన్ని పండుగల మాదిరిగా దసరా పండుగ ఉండదు. ప్రతిఒక్కరూ మటన్, చికెన్‌లకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా చుక్క వేసేందుకే ప్రాధాన్యత ఇస్తారు. దసరా పండుగ కోసం మద్యాన్ని ముందస్తు కొనుగోలు చేసి భద్రపరుచుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ మటన్, చికెన్ కొనుగోలు ఎట్లా అని తర్జనభర్జన పడుతున్నారు.

చుక్క.. ముక్క ఎట్లా?