
దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు
మంగపేట: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం 9వ రోజు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మండల కేంద్రంలోని ఉమా చంద్రశేఖరస్వామి ఆలయంలో అమ్మవారిని భక్తులు దుర్గాదేవిగా అలంకరించగా భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. అలాగే బోరునర్సాపురం, రాజుపేటలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో దుర్గాదేవిగా కొలువైన అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా అమ్మవారికి అర్చకులు అభిషేకం, కుంకుమార్చన, హోమంతో పాటు తదితర ప్రత్యేక పూజలు చేసి వివిధ రకాల పిండి వంటలను నైవేధ్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మండపాల వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.