
హోర్డింగులు, ఫ్లెక్సీల తొలగింపు
ఏటూరునాగారం: ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రోడ్లపై, ప్రధాన కూడళ్లలో ఉన్న హోర్డింగ్‌లు, రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను తొలగించినట్లు ఎంపీడీఓ శ్రీనివాస్, జీపీ కార్యదర్శి రమాదేవి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని బస్టాండ్, తాళ్లగడ్డ, క్రాస్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగు వేయించినట్లు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు వివరించారు. రాజకీయ పరమైన వాల్ పెయింటింగ్స్ ఉన్న చోట రంగులు వేయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జీపీ సిబ్బంది సుధాకర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లి గ్రామంలో మంగళవారం భూపాలపల్లి పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో గొడవలకు తావులేకుండా కలిసిమెలిసి ఉండాలన్నారు. దసరా పండుగ సందర్భంగా అల్లర్లకు పోవద్దని సూచించారు. అనుమానిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని చెప్పారు. సైబర్ నేరాలకు గురైన వెంటనే పోలీసులను ఆశ్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ నరేష్ కుమార్, ఎస్సై సాంబమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.
కాటారం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రగాయాలపాలైన ఘటన కాటారం మండలం కొత్తపల్లి శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కాటారం మండల కేంద్రానికి చెందిన పంతకాని వినయ్, గౌని నితీశ్ ద్విచక్రవాహనంపై మండలంలోని అంకుషాపూర్‌కు వెళ్లి తిరిగి కాటారం వైపుగా వస్తున్నారు. కొత్తపల్లి శివారులోని రైస్‌మిల్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోగా వినయ్ తలకు, నితీశ్ శరీర భాగాలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వినయ్ తలకు గాయం కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలిసింది.
ఎంజీఎం: ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) జాతీయ ప్యానెల్‌లో తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడా) నాయకులు ఘన విజయం సాధించారు. ఫైమా జాతీయ కో–చైర్మన్‌గా డాక్టర్ దుబ్యాల శ్రీనాథ్, జాతీయ కార్యదర్శిగా డాక్టర్ ఇస్సాక్ న్యూటన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తమపై నమ్మకం ఉంచి మద్దతు ఇచ్చిన సహచర వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం తరఫున బలమైన ప్రాతినిథ్యం వహిస్తూ, వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వీరికి జూడా నాయకులు, వైద్య సంఘాల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
భూపాలపల్లి: ఉద్యోగ విరమణ అనంతరం శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని అదనపు ఎస్పీ నరేష్‌కుమార్ ఆకాంక్షించారు. రేగొండ ఏఎస్సై బి.రవీందర్‌రెడ్డి, కొత్తపల్లిగోరి ఏఎస్సై జి.రాజేషం మంగళవారం ఉద్యోగ విరమణ పొందగా వారిని ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. శాలువాలు కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ రత్నం, పోలీసు అధికారులు పాల్గొన్నారు.