
ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
ములుగు రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకమన్నారు. ఎన్నికల అంశాలపై నోడల్ అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నగదు, మద్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేపట్టాలని సూచించారు. నోడల్ అధికారులు ప్రతిరోజూ రిపోర్ట్‌ను నిర్ణీత పార్మాట్‌లో సమర్పించాలని వివరించారు. నామినేషన్ పత్రాల స్వీకరణ నుంచి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ విధులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల హాండ్‌బుక్‌లోని ప్రతీ అంశంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనుమానాలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. మాన్‌పవర్ మేనేజ్‌మెంట్, బ్యాలెట్ బాక్స్‌ల మేనేజ్‌మెంట్, ట్రాన్స్‌పోర్టు, శిక్షణా కార్యక్రమాలు, మెటీరియల్, మీడియా కమ్యూనికేషన్, వెబ్‌కాస్టింగ్ నోడల్ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, ఆర్డీఓ వెంకటేశ్, డీపీఓ దేవరాజ్, సీపీఓ ప్రకాశ్, ఆర్టీఓ శ్రీనివాస్, ఎల్‌డీఎం జయప్రకాశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
స్ట్రాంగ్ రూంల భద్రత పటిష్టంగా ఉంచాలి
జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత పటిష్టంగా ఉంచాలని కలెక్టర్ దివాకర సూచించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూం ఏర్పాటుకు పరిశీలించారు. స్ట్రాంగ్ రూం కిటికీలు, వెంటిలేటర్లు మూసివేయాలని, రంగులు వేయించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సౌకర్యం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఓ దేవరాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర