
స్థానిక పోరుకు సై..
ములుగు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో పల్లెల్లో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. జిల్లాలో 10 మండలాల పరిధిలో 10 జెడ్పీటీసీ, 171 గ్రామ పంచాయతీలు, 83 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మంగపేట మండలంలో ఎన్నికలు నిర్వహించకూడదని సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. దీంతో మంగపేట మండలంలో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. కేవలం జెడ్పీటీసీ ఎన్నిక మాత్రమే నిర్వహించేందుకు అధికారులు రిజర్వేషన్ ప్రకటించారు. మంగపేట మండలం మినహా జిల్లాలోని 146 గ్రామ పంచాయతీలు, 69 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను ఐదు విడతల్లో నిర్వహించనుండగా ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు, తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించిన ఫలితాలు మాత్రం సర్పంచ్ ఫలితాల తర్వాతనే వెలువరిస్తామని ఎన్నికల అధికారులు ప్రకటించారు. సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
రెండు దశల్లో ఎంపీటీసీ,
మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు
ఎంపీటీసీ ఎన్నికలను రెండు దశల్లో, సర్పంచ్ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. జిల్లాలోని 10 జెడ్పీటీసీ స్థానాలకు, 69 ఎంపీటీసీ స్థానాలకు, 146 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం రిజర్వేషన్లను ఇప్పటికే ప్రకటించింది. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్, అక్టోబర్ 23, 27న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీలలో 146 సర్పంచ్ స్థానాలకు 1,290 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్, వార్డు స్థానాల ఫలితాలు అదేరోజు ఓటింగ్ ముగిసిన తర్వాత ఫలితాలు ప్రకటించనుండగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు మాత్రం నవంబర్ 11వ తేదీన వెల్లడించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.
ఢీ అంటే ఢీ..
గ్రామాల్లో ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు లోకల్ ఫైట్‌గా పేర్కొంటూ రాజకీయ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుతో పాటు ఆరు గ్యారంటీల అమలును, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించిందంటూ ఎన్నికల్లో ప్రజల వద్దకు అభ్యర్థులు వెళ్లనున్నట్లు చర్చించుకుంటున్నారు. అదే విధంగా బీఆర్‌ఎస్ పార్టీ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ యూరియా కొరతను ఓట్లుగా మార్చుకునేందుకు సిద్ధమవుతోంది. స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చూపెడుతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో నెలరోజుల పాటు ఎన్నికల సందడి నెలకొననుంది. రిజర్వేషన్లను బట్టి తమకే టికెట్లు ఇవ్వాలంటూ అధిష్టానం వద్దకు పలువురు ఆశావహులు ఇప్పటికే క్యూ కడుతూ పైరవీలు చేస్తున్నారు. గెలుపు గుర్రాలకే అవకాశం కల్పించేందుకు అధికార పార్టీ గ్రామాల్లో ప్రజలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరించేలా సర్వే నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.
ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
పల్లెల్లో వేడెక్కిన ఎన్నికల వాతావారణం
అధిష్టానం వద్దకు ఆశావహుల
పరుగులు
జిల్లాల వారీగా జెడ్పీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, వార్డుల వివరాలు
జిల్లా జెడ్పీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్ వార్డులు
హనుమకొండ 1 12 12 129 210 1,986
వరంగల్ 1 11 11 130 317 2,754
భూపాలపల్లి 1 12 12 109 248 2,102
మహబూబాబాద్ 1 18 18 193 482 4,110
ములుగు 1 10 10 83 171 1,520
జనగామ 1 12 12 134 280 2,534