
ఓటర్లను ప్రభావితం చేయొద్దు
ములుగు: ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో డబ్బులు, మందు, ఇతర వస్తువులను పంపిణీ చేసి ఓటర్లను ప్రభావితం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ శబరీశ్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీసు అధికారులతో ఎస్పీ సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. కోర్టులో ట్రయల్‌లో ఉన్న ప్రతికేసులోనూ తప్పనిసరిగా సాక్షులకు, ముద్దాయిలకు సమన్లు అందించాలన్నారు. నేరస్తులకు శిక్షపడే విధంగా కోర్టు కానిస్టేబుళ్లు విధులు నిర్వహించాలన్నారు. అంతిమంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసినందున అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఆటంకాలు కలిగించే వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్, సస్పెక్ట్ షీటర్స్‌పై ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలన్నారు. ఈ నెలలో నమోదైన కేసుల వివరాలపై పోలీస్ స్టేషన్ల వారీగా ఆరా తీసి, కేసులలో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. ప్రతీ కేసు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. దొంగతనాలు, ఆర్థిక నేరాలలో ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా దర్యాప్తును ముమ్మరం చేయాలని, పోగొట్టుకున్న నగదు లేదా వస్తువులను బాధితులకు అప్పగించేలా కృషి చేయాలని సూచించారు. పాత కేసుల దర్యాప్తులో పురోగతిని పరిశీలించి, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని వెల్లడించారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపైనా నిఘా పెంచాలన్నారు. చెక్ పోస్టులలో సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశించారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలలో అవగాహన తీసుకొచ్చి కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. యువత ఆన్‌లైన్ బెట్టింగ్ వలలో పడి మోసపోకుండా పోలీస్ స్టేషన్ల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఎవరైనా ఆన్‌లైన్ బెట్టింగ్‌ని ప్రోత్సహిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువత, ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా సైబర్ క్రైమ్ నేరాలపై ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీసీఆర్‌బీడీ ఎస్పీ కిశోర్‌కుమార్, ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్ శంకర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ కుమార్, సీఐలు శ్రీనివాస్, సురేష్, రమేష్, దయాకర్, వివిధ మండలాల ఎస్సైలు పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెంచాలి
ఎస్పీ డాక్టర్ శబరీశ్