
పెరుగుతున్న గోదావరి.. నిలిచిన రాకపోకలు
వాజేడు: గోదావరి వరద భారీగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మండల పరిధిలోని పేరూరు వద్ద నీటిమట్టం సోమవారం 17.22 మీటర్లకు చేరుకుంది. దీంతో మండలంలోని టేకులగూడెం వద్ద జాతీయ రహదారి ముంపునకు గురికావటంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు, గుమ్మడి దొడ్డి, పూసూరు, ఎడుచర్లపల్లి, బొమ్మనపల్లి, పేరూరు, కృష్ణాపురం గ్రామాల మధ్యన గోదావరి వరద రహదారిపైకి చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పల్లపు ప్రాంతాల గుండా వచ్చిన వరద నీరు మండలంలోని మిర్చి తోటలు, వరి పొలాలను ముంచెత్తింది. అప్రమత్తమైన అధికారులు పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. పల్లపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశారు.
సమ్మక్కసాగర్‌లోకి 10,29,130 క్యూసెక్కుల నీరు
కన్నాయిగూడెం: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. దీంతో మండల పరిధిలోని తుపాకులగూడెం సమీపంలో గల సమ్మక్కసాగర్ బ్యారేజీలోకి ఎగువ నుంచి 10,29,130 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో బ్యారేజీ 59 గేట్లను ఎత్తి నీటిని అదే మోతాదులో బయటకు వదులుతున్నట్లు బ్యారేజీ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 83.90 మీటర్లుగా ఉన్నట్లు వివరించారు.

పెరుగుతున్న గోదావరి.. నిలిచిన రాకపోకలు