
తగ్గుముఖం పట్టిన గోదావరి
● ఇంకా నీటిలోనే రోడ్లు, మిర్చి పంటలు
వాజేడు: ఉధృతంగా పెరిగిన గోదావరి వరద మంగళవారం నుంచి తగ్గుముఖం పట్టింది. మండల పరిధిలోని పేరూరు వద్ద ఉదయం 17.370 మీటర్లుగా ఉన్న నీటి మట్టం సాయంత్రం వరకు 16.780 మీటర్లకు తగ్గింది. పల్లపు ప్రాంతాల గుండా వచ్చిన గోదావరి వరద మండలంలో పలు చోట్ల మిర్చి పంటలను ముంచెత్తింది. వరద తగ్గుముఖం పడుతున్నప్పటికీ మిర్చి పంటలు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. అదే విధంగా టేకులగూడెం గ్రామ చివరన జాతీయ రహదారిపైకి చేరిన వరద ఇంకా తగ్గలేదు. దీంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు– గుమ్మడి దొడ్డి, పేరూరు– కృష్ణాపురం, పూసూరు– ఏడ్జెర్లపల్లి, ఏడ్జెర్లపల్లి– బొమ్మన పల్లి గ్రామాల మధ్యన గోదావరి రహదారులపైకి చేరడంతో ఆయా గ్రామాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటిలోకి ఎవరూ వెళ్లకుండా అధికారులు రహదారులకు అడ్డంగా ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు.
సమ్మక్కసాగర్‌లోకి తగ్గిన వరద
కన్నాయిగూడెం: మండల పరిధిలోని సమ్మకసాగర్ బ్యారేజీలోకి సోమవారం వరకు భారీగా వచ్చిన వరద నీరు మంగళవారం కొంతమేర తగ్గి 9,16,570 క్యూసెక్కుల మేర వచ్చి చేరుతోంది. బ్యారేజీకి ఎగువ నుంచి వస్తున్న వరద నీరు తగ్గడంతో బ్యారేజీ ప్రాంతంలో గోదావరి కొంత శాంతించింది. బ్యారేజీ 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీలో నీటిమట్టం ప్రస్తుతం 83.30 మీటర్లుగా ఉంది.

తగ్గుముఖం పట్టిన గోదావరి