
రైతుల సమస్యలు పరిష్కరించాలి
● రైతుసంఘం జిల్లా కార్యదర్శి వెంకట్‌రెడ్డి
ములుగు రూరల్: రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ దివాకరను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు సకాలంలో యూరియా అందించాలన్నారు. లేని పక్షంలో పంటలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రైతులకు యూరియా అందించాలని కోరారు. రబీ సీజన్‌లో వడగండ్ల వానల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరారు. జిల్లాలో 2,993 ఎకరాల్లో రూ.5.72కోట్ల మేర పంటనష్టం వాటిల్లిందని వివరించారు. యాసంగి సన్నదాన్యానికి బోసన్ డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుసంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నం రాజేందర్, కొర్ర రాజు, కృష్ణారావు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.