
బతుకమ్మ కానుక..
‘అక్కా చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’ పేరిట చీరలు
మండలాల వారీగా
కేటాయించిన చీరలు..
వెంకటాపురం(ఎం): బతుకమ్మ పండుగకు మహిళలకు ఇందిరమ్మ చీరలు కానుకగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పొదుపు సంఘాల సభ్యులకు మాత్రమే ఒక్కొక్కరికి రెండు చీరలు ఈనెల 22 నుంచి ఉచితంగా రెండు విడతల్లో అందించనున్నారు. ఒక్కో చీర ధర రూ.800 వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
76,469 మందికి.. 1,52,938 చీరలు
జిల్లాకు 10 మండలాల పరిధిలో 171 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 9 మండల సమైఖ్యలు ఉండగా 355 గ్రామ సమైఖ్యలు ఉన్నాయి. వీటి పరిధిలో 7,019 స్వయం సహాయక సంఘాలు ఉండగా.. 76,469 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున 1,52,938 చీరలు జిల్లాకు రావాల్సి ఉంది. జిల్లాకు వచ్చే ఇందిరమ్మ చీరలను నిల్వ చేసేందుకు డీఆర్‌డీఏ అధికారులు ములుగు, గోవిందరావుపేట, ఏటూరునాగారం మండలాల్లో గోదాంలను కేటాయించారు. ఆరున్నర మీటర్లు గల ప్రింటెడ్ పాలిస్టర్ చీరలు 1,44,478, తొమ్మిది మీటర్లు గల పాలికాట్ చీరలు 8,460 జిల్లాకు రానున్నాయి. ఈనెల 22 నుంచి 30 వరకు మహిళలకు చీరలను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండు విడతల్లో పంపీణీ
ఈనెల 22వ తేదీ నుంచి చీరలు అందించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు రేషన్ దుకాణాలకు చెందిన డీలర్ల ద్వారా ఒకరికి ఒక చీర చొప్పున అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఈసారి స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు మాత్రమే రెండేసి చీరల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల పరిధిలోని గ్రూపుల వారీగా సభ్యుల వివరాలు సేకరించి మండలాల వారీగా కావాల్సిన చీరల జాబితాను ప్రభుత్వానికి పంపించారు. బతుకమ్మ పండుగ ప్రారంభం రోజున ఒకటి, సద్దుల బతుకమ్మకు మరో చీరను అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. చీరలను ప్రత్యేక సంచిలో ప్యాక్ చేసి ఇవ్వనున్నారు. ఆ సంచిపై ఇందిరాగాంధీ ఫొటో, ఇందిర మహిళా శక్తి లోగోతో పాటు శ్రీఅక్కాచెల్లెళ్లకు మీ రేవంతన్న కానుకశ్రీ అని రాసి ఉండనుంది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురి మంత్రుల ఫొటోలను ముద్రించారు.
మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే..
ఒక్కొక్కరికి రెండు చీరలు
ఈనెల 22నుంచి పంపిణీకి ఏర్పాట్లు
మండలం మహిళలు చీరలు
ములుగు 17,043 34,086
మంగపేట 12,535 25,070
వెంకటాపురం(ఎం) 8,438 16,876
గోవిందరావుపేట 7,959 15,918
ఏటూరునాగారం 7,544 15,088
వెంకటాపురం(కె) 7,522 15,044
తాడ్వాయి 6,183 12,366
వాజేడు 6,002 12,004
కన్నాయిగూడెం 3,245 6,490

బతుకమ్మ కానుక..