
దరఖాస్తులను నిష్పక్షపాతంగా పరిశీలించాలి
ములుగు: దరఖాస్తులను నిష్పక్షపాతంగా పరిశీలించి భూ రికార్డులను ప్రామాణికంగా రూపొందించాలని కలెక్టర్ దివాకర సూచించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్‌లతో కలిసి గురువారం సాదాబైనామాల దరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ మండలాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, భూ పరమైన వివాదాలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన సాదాబైనామాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు, అందులో ఎన్ని నోటీసులు జనరేట్ చేసి సర్వే ప్రక్రియ పూర్తి చేశారు, పెండింగ్‌లో ఉన్న వాటి కారణాల గురించి తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్ ఉన్న మండలాల్లో అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్డీఓ లాగిన్‌లో ఉన్న విరాసిత్, మిస్సింగ్ సర్వే నంబర్లు, పేరు, సర్ నేమ్, తదితర పెండింగ్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని తెలిపారు. భూ భారతి అప్లికేషన్‌లో నమోదవుతున్న సాదాబైనామాలు, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్, గ్రీవెన్స్ దరఖాస్తుల పరిశీలన, ధ్రువీకరణలో వేగం పెంచాలని ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్లు, కలెక్టరేట్ కార్యాలయ పర్యవేక్షకులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర