
ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలున్న రైతులు మాత్రమే ఎంపిక
ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు సాగునీటిని అందించేందుకు సౌర జల గిరివికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు జనవరి నుంచి అధికారులు సర్వేలను ముమ్మరంగా చేపట్టారు. 2025–26 వరకు ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ఐటీడీఏ అధికారులు ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో ఉన్న గిరిజనులు సాగుచేస్తున్న ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలున్న భూములకు మాత్రమే ఈ పథకం వర్తించే విధంగా ప్రభుత్వం విధివిధానాలు రూపకల్పన చేసింది. అయితే ఈ సర్వేల ద్వారా ఇప్పటి వరకు 250 ఎకరాలను అధికారులు గుర్తించారు. ప్రభుత్వం 560 మందికి పథకం వర్తింపజేయాలని ఐటీటీఏకు టార్గెట్‌ను కేటాయించింది. దీంతో ఐటీడీఏ అధికారులు ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూములు కలిగిన రైతుల వద్దకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. జీసీఎస్‌ద్వారా ఆ భూములను గుర్తించి అర్హులైన రైతుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇటీవల కలెక్టర్ దివాకర సైతం అధికారులతో సమీక్షించి ఈ పథకాన్ని అతి త్వరలో గ్రౌండింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
రెండు ఎకరాలకు పైనే..
రెండు ఎకరాలకు పైగా సాగు భూమి కలిగిన రైతులనే అర్హులుగా పరిగణలోకి తీసుకుంటారు. రెండు ఎకరాల కంటే తక్కువ ఉంటే పక్కనే ఉన్న గిరిజన రైతు భూమిని కలిసి ఒక యూనిట్‌ను మంజూరు చేస్తారు. ఇలా రెండు నుంచి ఆపైన భూమి కలిగి ఉన్న గిరిజన రైతులను ఇందిర సౌర జల గిరివికాసం పథకాన్ని అప్పగించనున్నారు. ఈ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ అనేక మంది గిరిజన దర్బార్‌లో రైతులు వినతులు సమర్పిస్తున్నారు. వాటి ఆధారంగా సర్వేలు చేయడంతో పాటు నేరుగా వచ్చి దరఖాస్తులు చేసుకున్న వారితో పాటు అర్హులైన రైతుల భూములను కూడా పరిశీలించి వివరాలు నమోదు చేసుకుంటున్నారు.
ఒక్క యూనిట్‌కు రూ.6 లక్షలు
గిరిజనుల ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా భూమిలో రైతుకు సోలార్ ప్యానెల్, బోరు, మోటారు ఇతర సామగ్రిని అందించడానికి ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా రూ.6 లక్షలతో ఒక యూనిట్‌ను మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ యూనిట్ మంజూరైన రైతు పొలంలో బోరును దింపి సోలార్ ప్యానెల్‌తో త్రీఫేజ్ విద్యుత్ వచ్చేలా సౌకర్యాలు ఏర్పాటు చేసి మోటారు బిగించి సాగునీరు అందేలా చూస్తారు. దీంతో ఒక రైతుకు రూ. 6 లక్షలు విలువ చేసే యూనిట్ దక్కనుంది. అయితే సర్వేలు పూర్తికాగానే యూనిట్‌ను మంజూరు చేసేందుకు ఐటీడీఏ పీఓ కావాల్సిన ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. దీంతో గిరిజనులకు సాగునీటి కష్టాలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో విద్యుత్ సరఫరా లేక అటవీ హక్కుల భూములకు మోటార్లను బిగించుకోలేక, పంటలు పండించక భూములు పడావు పడి ఉన్నాయి. ప్రస్తుతం సోలార్ వసతితో రెండు పంటలకు సాగునీరు అందే అవకాశం ఉంది.
ముమ్మరంగా కొనసాగుతున్న సర్వే
560 మందికి పథకం వర్తించేలా
ఐటీడీఏకు టార్గెట్