
వాగు దాటి వైద్యం చేసిన సిబ్బంది
వెంకటాపురం(కె): వాగు దాటి వైద్య ఆరోగ్య సిబ్బంది ఆదివాసీలకు వైద్యం చేశారు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని పరిధిలోని సీతారాంపురం గ్రామానికి వెళ్లాలంటే మధ్యలో పూసు వాగు అడ్డుగా ఉంటుంది. ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ద్విచక్ర వాహనాలపై వాగు వరకు వైద్య సిబ్బంది వెళ్లారు. వాహనాలను వాగు వద్ద పెట్టి వాగు దాటి రెండు కిలో మీటర్లు నడిచి గ్రామానికి చేరుకున్నారు. మాతా శిశు సంరక్షణ వైద్యాధికారి డాక్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య సిబ్బంది మలేరియాపై ఇంటింటా సర్వే నిర్వహించారు. జ్వరాలతో బాధపడుతున్న వారికి మందులు ఇచ్చి రక్త నమూనాలు సేకరించారు. తాగునీటి బావిని పరిశీలించి క్లోరినేషన్ చేశారు. గ్రామంలో నిల్వ ఉన్న నీటిని ఇంటింటా తిరిగి పార బోశారు. ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడిగా ఉన్నప్పుడే ఆహారాన్ని తినాలని సూచించారు. డెంగీ, మలేరియా రాకుండా జాగ్రత్తలను పాటించాలని, నీటితో ఉన్న డ్రమ్ములు, గోలాలపై మూతలను పెట్టుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెచ్‌ఈఓ కోటిరెడ్డి, వెంకట రమణ, నాగమణి, సమ్మక్క, మోహన్ ఉన్నారు.