
గత కొంత కాలంగా యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'కెజిఎఫ్ 2'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 14 న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ రికార్డులు సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా బెంగుళూరులో జరిగిన 'కెజిఎఫ్ 2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్ర బృందం పాల్గొంది. ఇందులో భాగంగా ఈ వేదికపై హీరో యష్ మాట్లాడుతూ ఈ చిత్రంపై పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వేదికపై మొదట దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్‌కి హీరో యష్ నివాళులు అర్పించాడు.
అనంతరం యష్ మాట్లాడుతూ.. ఈ చిత్రం మా ఎనిమిదేళ్ల కష్టం. దీని కోసం లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రొడక్షన్ బాయ్ వరకు అందరూ చాలా కష్టపడ్డారు. వారి చెమట, రక్తాన్ని చిందించి మరీ ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అయితే ప్రతి ఒక్కరూ సినిమా చూసిన తరువాత ఆ క్రెడిట్ నాకు ఇస్తున్నారు. కానీ అది సరికాదు. 'కేజీఎఫ్' మొత్తం కన్నడ సినిమాకే గర్వకారణం. ఈ చిత్రం నాది కాదు ఇది ప్రశాంత్ నీల్ సినిమా. ఆ క్రెడిట్ అంతా కేవలం ప్రశాంత్ నీల్‌కే చెందాలి. కేవలం అతని వల్లనే ఇది సాధ్యమైంది. నేను ఈ చిత్రంలో నటించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని హీరో యష్ తెలిపారు.